ఫేక్ ఫైర్ ఎన్‌‌వోసీలతో స్టూడెంట్స్ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఫేక్ ఫైర్ ఎన్‌‌వోసీలతో స్టూడెంట్స్ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్
  •     హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
  •     రెండేండ్లకోసారి ఫైర్ సేఫ్టీ రెన్యూవల్ కు వెసులుబాటు కల్పిస్తామని హామీ

హైదరాబాద్, వెలుగు: కాలేజీల్లో చదివే విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఫేక్ ఫైర్ ఎన్‌‌వోసీలతో వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ హెచ్చరించారు. ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై మంగళవారం నాంపల్లిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో హైడ్రా, ఇంటర్ బోర్డు అధికారులు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్​మాట్లాడుతూ ఫైర్ ఎన్‌‌వోసీల విషయంలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఫైర్ డిపార్ట్‌‌మెంట్, ఇంటర్ బోర్డు సమన్వయంతో ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌‌వేర్ ను తీసుకొస్తున్నట్టు చెప్పారు. తద్వారా కాలేజీలు సమర్పించే ఎన్‌‌వోసీలు అసలైనవో కాదో.. సులభంగా వెరిఫై చేసే అవకాశం ఉంటుందన్నారు. ఫేక్ ఎన్‌‌వోసీల వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ప్రస్తుతం ఏటా తీసుకోవాల్సిన ఫైర్ ఎన్‌‌వోసీ రెన్యూవల్‌‌ను ఇకపై రెండేండ్లకోసారి చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఫేక్ ఫైర్ ఎన్‌‌వోసీలు సమర్పించిన కాలేజీలకు విధించిన రూ.8 లక్షల జరిమానాపై పునరాలోచన చేస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. కాలేజీ నిర్వాహకులు తమ దగ్గరున్న ఎన్‌‌వోసీలు అసలైనవో.. కాదో ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు. ఫైర్ ఎన్‌‌వోసీల కోసం ఎవరూ మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, అంతా ఆన్‌‌లైన్ ప్రాసెస్ చేశామని స్పష్టం చేశారు. https://hydraafirenoc.telangana.gov.in వెబ్‌‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, హైడ్రా కార్యాలయానికి రావాల్సిన పని లేదని  సూచించారు. జీహెచ్ఎంసీతోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని కాలేజీలన్నీ ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలన్నారు. సమావేశంలో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఇంటర్ బోర్డు  జేఎస్ వసుంధర తదితరులు పాల్గొన్నారు.