ఆత్మహత్యలపై ప్రతి నెలా రిపోర్టు ఇవ్వండి...మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశం

ఆత్మహత్యలపై ప్రతి నెలా  రిపోర్టు ఇవ్వండి...మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీలలో జరుగుతున్న ఆత్మహత్యలపై ప్రతి నెలా రిపోర్టు ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్‌‌ఎంసీ గైడ్ లైన్స్ జారీ చేసింది. కాలేజీల్లో విద్యార్థుల అసహజ మరణాలు సంభవిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు వివరాలు, ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ రిపోర్టు, పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థుల మానసిక ఒత్తిడిని నివారించేందుకు క్యాంపస్‌‌లో, ఒక కిలోమీటరు పరిధిలో 24 గంటల పాటు నిపుణులైన వైద్యుల సహాయం, హాస్టల్ వార్డెన్లు, కౌన్సెలర్ల సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. 

కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు డీన్, ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్ వంటి కీలక అడ్మినిస్ట్రేటివ్ ఖాళీలను నిర్దేశిత గడువులోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది. రిజర్వ్‌‌డ్, దివ్యాంగ కోటా పోస్టుల కోసం స్పెషల్ రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్‌‌లు నిర్వహించి, పెండింగ్ స్కాలర్‌‌ షిప్‌‌లను వెంటనే క్లియర్ చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాల అమలుపై కాలేజీ ప్రిన్సిపాల్, డీన్‌‌లు యాక్షన్ టేకెన్ రిపోర్టును ప్రతినెలా antiragging@nmc.org.in ఈ-మెయిల్‌‌కు సమర్పించాలని తెలిపింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు, డీఎంఈలు, మెడికల్ కాలేజీలు అత్యంత ప్రాధాన్యతతో గడువులోగా రిపోర్టులు పంపాలని ఎన్‌‌ఎంసీ పేర్కొంది.