పాక్ అణు స్థావరం వద్ద మన డ్రోన్ కూలింది!..ఆపరేషన్ సిందూర్ సమయంలో అనుకోని ఘటన : మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

పాక్ అణు స్థావరం వద్ద మన డ్రోన్ కూలింది!..ఆపరేషన్ సిందూర్ సమయంలో అనుకోని ఘటన : మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
  • మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడి

న్యూఢిల్లీ: గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌‌లోని అణ్వాయుధ కేంద్రం కిరానా హిల్స్‌‌ వద్ద మన డ్రోన్ కూలిపోయిందని మాజీ చీఫ్‌‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. అయితే, ఆ ఘటన అనుకోకుండా జరిగిందని, రాడార్‌‌‌‌లను ధ్వంసం చేసేందుకు పంపిన డ్రోన్ ఫ్యూయెల్ అయిపోవడంతో కిరానా హిల్స్‌‌ను ఢీకొట్టి పేలిపోయిందని తెలిపారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్న కిరానా హిల్స్‌‌పై దాడి చేశారా? లేదా? అని నన్ను అప్పుడప్పుడూ అడుగుతుంటారు. 

కానీ, నాడు సర్గోధా ప్రాంతం చుట్టూ ఉన్న రాడార్ల కోసం వెతకడానికి పంపిన ఇండియన్ డ్రోన్(ఇజ్రాయెల్ నుంచి సమకూర్చుకున్న హ్యారోప్ డ్రోన్)లో ఇంధనం అయిపోవడంతో కిరానా హిల్స్‌‌ను ఢీకొట్టి కూలిపోవాల్సి వచ్చింది” అని జనరల్ చౌహాన్ చెప్పారు. పాకిస్తాన్ చర్చలు జరపాలని కోరిన తర్వాత సర్గోధాపై దాడి చేయడానికి ఎయిర్ చీఫ్ తన ఆమోదం కోరారని, అయితే చెడు వాతావరణం కారణంగా టార్గెట్‌‌ను భోలారికి మార్చాల్సి వచ్చిందన్నారు.