- స్టేషన్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు
- బస్సు 500 మీటర్ల దూరంలో ఉండగానే ఆటోమెటిక్ అనౌన్స్మెంట్
- ముందస్తు సమాచారంతో ప్రయాణికులకు మేలు
- 20 రోజులుగా ట్రయల్ రన్
- త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో ఇంప్లిమెంట్కు ప్లాన్
మహబూబ్‌నగర్, వెలుగు : రైల్వే స్టేషన్లలో ఏ మార్గం నుంచి ఏ రైలు వస్తోంది? సమయానికే రైలు వస్తోందా? ఆలస్యం అవుతుందా? ఏ ప్లాట్‌ఫాం వద్ద ఆగుతుంది? వంటి వివరాలు క్షణాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌పై, ఆటోమెటిక్ అనౌన్స్మెంట్ద్వారా ప్రయాణికులకు సమాచారం అందుతుంది.
గ్లోబల్ పొజిషనింగ్సిస్టం(జీపీఎస్) ద్వారా ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఇదే తరహా సేవలను ప్రయాణికులకు అందించేందుకు తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) సిద్ధమైంది. అందుకు మహబూబ్నగర్జిల్లాలోని జడ్చర్ల బస్ స్టేషన్‌ను పైలట్‌ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, జీపీఎస్ విధానం ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించడం ప్రారంభించింది.
ట్రాన్సిట్హబ్ గా జడ్చర్ల ఎంపిక
కొద్ది రోజుల కిందట టీజీ ఆర్టీసీ ఆఫీసర్లు ఆయా రాష్ర్టాల్లో పర్యటించారు. అక్కడి ప్రభుత్వాలు ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలు గురించి తెలుసుకున్నారు. కర్నాటక రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో రాయచూర్బస్ స్టేషన్లో జీపీఎస్ విధానం ద్వారా మెట్రో స్టేషన్ తరహాలో ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి అక్కడి ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ విధానం ద్వారా ప్రయాణికులకు ఈజీగా బస్సుల సమాచారం చేరుతుండడంతో, ఇదే విధానాన్ని తెలంగాణలోనూ ఇంప్లింమెంట్ చేయాలని నిర్ణయించారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద ఒక బస్ స్టేషన్లో దీన్ని ఇంప్లిమెంట్చేసి, విజయవంతం అయ్యాకా మిగతా బస్ స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో రాష్ర్టంలో ట్రాన్సిట్హబ్(బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు, ప్రయాణికులు ఒక వాహనం నుంచి మరో వాహనంలో సులభంగా వెళ్లడానికి వీలుండే ప్రాంతం) గా పేరొందిన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బస్ స్టేషన్‌ను ఎంపిక చేశారు.
ఈ నెల మొదటి వారం స్టేషన్లో ఎల్ఈడీ స్క్రీన్లను, జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. కంప్యూటర్ను అందుబాటులో ఉంచారు. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఏ బస్సు ఎక్కడికి వస్తోంది? ఎప్పుడు వస్తోంది? ఆయా మార్గాల్లో ఏ బస్సు సర్వీసులు వస్తున్నాయి? అని ఎల్ఈడీ స్ర్కీన్ మీద డిస్ప్లే అవుతోంది.
బస్సు స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉండగానే జీపీఎస్ విధానం ద్వారా అటోమెటిక్ అనౌన్స్మెంట్ కూడా వస్తోంది. ఆ బస్సు ఏ ప్లాట్ ఫాం వద్ద ఆగుతుందో కూడా సమాచారం అందుతోంది. ఈ విధానంపై ప్రయాణికులు కూడా సంతృప్తిగా ఉన్నట్లు టీజీ ఆర్టీసీ ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలింది. ఈ వివరాలన్నిటిని రికార్డ్ చేసి సంస్థకు 20 రోజుల ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు నివేదికను పంపారు. త్వరలో రాష్ర్టంలోని పలు బస్ స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పెరగనున్న భద్రత
జీపీఎస్ విధానం ద్వారా ఆర్టీసీలో భద్రత పెరగనుంది. స్టేషన్లో, బస్సులో జీపీఎస్ విధానం ఉండడం వల్ల బస్సును లైవ్ ట్రాకింగ్‌ను చేయొచ్చు. ఏదైన ఎమర్జెన్సీ ఏర్పడితే బస్సులోని సెంట్రీ లేదా ప్యానిక్ బటన్ నొక్కడం ద్వారా కంట్రోల్ రూముకు సమాచారం అందుతుంది. బస్సులు ఎక్కడైనా అనవసరంగా ఆగుతున్నాయా, రూట్ తప్పి వెళ్తున్నాయా అనే సమాచారం కూడా తెలిసిపోతుంది. ఆటోమెటిక్ వాయిస్ విధానం ద్వారా ఆయా మార్గాల్లో కొత్తగా ప్రయాణించే వారికి, దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
ప్యాసింజర్లు సంతృప్తిగా ఉన్నారు
టీజీ ఆర్టీసీ మొదటి సారి జీపీఎస్ సిస్టం బస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదట పైలట్‌ప్రాజెక్టు కింద జడ్చర్ల బస్ స్టేషన్‌ను ఎంపిక చేసి, సేవలు ప్రారంభించింది. జీపీఎస్ విధానం ద్వారా ఎల్ఈడీ స్ర్కీన్, ఆటోమెటిక్ అనౌన్స్మెంట్ గురించి ప్రయాణికులను ఆరా తీయగా బాగున్నాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పై ఆఫీసర్లకు కూడా తెలియజేశాం.
-కె.అశోక్ కుమార్, ఆర్టీసీ డీఎం, మహబూబ్‌నగర్
