ఒకప్పుడు యూనివర్సిటీలో చదువుకోవడం అంటే తప్పనిసరిగా కాలేజీకి వెళ్లాలి. అధ్యాపకుల సమక్షంలోనే చదువుకోవాలి. రోజూ క్లాస్‌రూమ్‌కు హాజరుకావాలి. అలాంటి పరిస్థితుల్లో ‘విశ్వవిద్యాలయమే విద్యార్థి దగ్గరకు వెళ్లాలి’ అనే ఆలోచనతో మొదలైన ప్రయోగం.. నేడు లక్షలాది మందికి ఉన్నత విద్యా అవకాశాలను అందించే స్థాయికి చేరింది.
అదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ). 1982లో ప్రారంభమై నాలుగు దశాబ్దాలకు పైగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌లో సేవలందించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. ఇప్పుడు డిజిటల్ విద్యా వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది.
డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి, మైక్రో క్రెడెన్షియల్స్, ఉపాధ్యాయ శిక్షణ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ ‘భవిష్యత్ విద్యకు 360 డిగ్రీల యూనివర్సిటీ’గా మారే దిశగా ముందుకు సాగుతోంది. వయసు, ప్రాంతం, ఉద్యోగం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఏర్పడిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేడు 45వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
1983---– 84 విద్యా సంవత్సరంలో కేవలం 6,231 మంది విద్యార్థులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం 6.5 లక్షల మంది విద్యార్థులతో కొనసాగుతోంది. మొదట్లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతో మొదలుపెట్టిన ప్రయాణం ఆపై ఎంబీఏ, బీఈడీ, పీజీ తదితర కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సర్టిఫికెట్ స్థాయి నుంచి పీహెచ్‌డీ వరకు పలు విభాగాల్లో కోర్సులు అందిస్తోంది.
తెలంగాణవ్యాప్తంగా 135కు పైగా స్టడీ సెంటర్లు, 10 రీజినల్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు యూనివర్సిటీ చేరువవుతోంది. సాధారణ విద్యా విధానంలో ఉన్నత విద్యను కొనసాగించలేని అనేక వర్గాలకు బీఆర్‌ఏఓయూ అవకాశాలను కల్పిస్తోంది. ఉద్యోగాలు చేస్తూ చదవాలనుకునేవారు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ వర్గాలు, ఇంట్లో ఉంటూనే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు, మధ్యలో చదువు ఆపేసినవారు, రెగ్యులర్ విద్యా విధానంలో చదువు కొనసాగించలేని ఎంతోమందికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
ప్రత్యామ్నాయ మార్గంగా నిలిచింది.
సంపాదిస్తూ...చదువు
బీఆర్‌ఏఓయూ ప్రారంభమైన తొలినాళ్లలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఉద్యోగులు, గృహిణులు, మధ్యవయస్కులు, చదువు ఆపేసినవారికి మరో అవకాశం అనే భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. యువత కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ను ఎంచుకుంటోంది. వారికి అనుగుణంగా సౌకర్యవంతమైన విద్యా విధానాన్ని బీఆర్‌ఏఓయూ అందజేస్తోంది.
ఒకప్పుడు పుస్తకాల్లోని పాఠ్యాంశాలు, స్టడీ సెంటర్లలో కౌన్సెలింగ్ ద్వారా అందించిన విద్య.. కాలక్రమేణా మల్టీమీడియా, ఆన్‌లైన్ క్లాస్‌లు, డిజిటల్ సోర్సెస్ దిశగా అభివృద్ధి చెందింది. ఉద్యోగం చేస్తూనే చదువుకోవడం, పోటీ పరీక్షలకు సిద్ధమవడం, వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడం లేదా తదుపరి ఉన్నత విద్యను అభ్యసించడం వంటి అవకాశాలను విద్యార్థులకు కల్పించింది. తద్వారా ‘సంపాదిస్తూ.. చదువుతూ’ అనే భావనను బీఆర్‌ఏఓయూ ముందుకు తీసుకెళ్లింది.
డిజిటల్ యూనివర్సిటీ దిశగా..
ప్రస్తుతం బీఆర్‌ఏఓయూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానం నుంచి డిజిటల్ యూనివర్సిటీ వ్యవస్థ వైపు మారుతోంది. ఇందులో భాగంగా ‘బోధి’ (BODHI) లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కీలకంగా మారింది. దీని ద్వారా విద్యార్థులకు వీడియో లెక్చర్లు, ఇంటరాక్టివ్ రీసోర్సెస్, లైవ్ ఆన్‌లైన్ క్లాసులు, విద్యార్థుల సౌకర్యానికి అనుగుణంగా చదువుకునే అవకాశాలు అందుబాటులో ఉంచింది.
డిజిటల్ లెర్నింగ్ కంటెంట్, డిజిటల్ లైబ్రరీ, ఆన్‌లైన్ అకడమిక్ సర్వీసులు, మైక్రో క్రెడెన్షియల్స్ వంటి కార్యక్రమాలతో లెర్నింగ్ విధానాన్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరింత బలోపేతం చేస్తోంది. అందులో భాగంగా, ఇప్పటికే ఉన్న పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలోకి మార్చడం మాత్రమే కాకుండా.. మారుతున్న కాలానికి, విద్యార్థి అవసరాలకు అనుగుణంగా మొత్తం అభ్యసన విధానాన్ని పునర్‌వ్యవస్థీకరించడమే లక్ష్యంగా విశ్వవిద్యాలయం తన డిజిటల్ ఎకో సిస్టమ్‌ను విస్తరిస్తోంది.
నైపుణ్యాలు, ఉపాధిపై ప్రత్యేక దృష్టి
మారుతున్న ఉద్యోగ మార్కెట్ నేపథ్యంలో డిగ్రీతోపాటు నైపుణ్యాభివృద్ధి, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, వృత్తి విద్య, వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఏఓయూ తన స్కిల్ డెవలప్‌మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ కార్యక్రమాలను విస్తరిస్తోంది. ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణపై దృష్టి సారిస్తోంది. విద్యా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాల పెంపుకోసం సీవోఎల్, టీసీఎస్ అయాన్, వీహబ్, రాస్కి, సైయెంట్ ఫౌండేషన్, ఇగ్నిటస్, రామనంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకుంది.
అందుబాటులో క్వాలిటీ ఎడ్యుకేషన్
బీఆర్‌ఏఓయూ తన 4 దశాబ్దాల అనుభవాన్ని.. భవిష్యత్ విద్యా వ్యవస్థకు అనుగుణంగా మలుచుకుంటోంది. రెగ్యులర్ విద్యావిధానాన్ని అనుసరించలేని విద్యార్థులకు అనుగుణంగా ఎడ్యుకేషన్‌ను అందించడంలో ఇన్నేండ్ల అనుభవం వర్సిటీకి ప్రధాన బలంగా నిలిచింది. క్వాలిటీ ఎడ్యుకేషన్, సౌకర్యవంతమైన టీచింగ్ విధానాలను సమన్వయం చేయడం ద్వారా ఎంతోమందికి ఉన్నత విద్యను చేరువ చేయొచ్చని బీఆర్‌ఏఓయూ నిరూపించింది.
తరగతి గదులను దాటి విద్యను ప్రతి ఒక్కరి గడప వద్దకు తీసుకెళ్లిన బీఆర్‌ఏఓయూ.. ఇప్పుడు అదే స్ఫూర్తితో డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తోంది. ‘విద్య మీ ముంగిట’ అనే తన ప్రాథమిక లక్ష్యాన్ని కొనసాగిస్తూ.. ఓపెన్ యూనివర్సిటీ నుంచి 360 డిగ్రీల డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయాణంలో బీఆర్‌ఏఓయూకు ముందున్న సవాలు కేవలం మరిన్ని కోర్సులు, మరింతమంది విద్యార్థులను చేర్చుకోవడం కాదు.
విద్యార్థులకు అవసరమైన క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన అవకాశాలను ఒకే వ్యవస్థలో అందించగల విశ్వవిద్యాలయంగా ఎదగడం. విద్య, ఉపాధి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు ఎక్కడున్నా.. వారికి అవసరమైన ఎడ్యుకేషన్, నైపుణ్యం అందుబాటులో ఉండేలా సమగ్ర విద్యా వాతావరణాన్ని నిర్మించడం. డిగ్రీలు అందించే సంస్థగానే కాకుండా, స్టూడెంట్ల జీవితంలోని ప్రతి దశలో అవసరమైన అభివృద్ధికి తోడ్పడే బలమైన డిజిటల్ వేదికగా నిలవాలనే లక్ష్యాలతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ముందుకు సాగుతోంది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 45వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ..
ఉపాధ్యాయుల శిక్షణ, ఫారిన్ లాంగ్వేజెస్‌కు ప్రాధాన్యం
ఉపాధ్యాయ విద్య, వృత్తిపరమైన అభివృద్ధి కూడా బీఆర్‌ఏఓయూ భవిష్యత్ ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతోంది. మైక్రో క్రెడెన్షియల్స్, వృత్తి విద్య, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ వంటి కొత్త విద్యా మార్గాలకు కూడా విస్తరిస్తోంది. అదే సమయంలో జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, కొరియన్ వంటి విదేశీ భాషలను నేర్చుకునే అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆవిధంగా రెగ్యులర్ డిగ్రీ కోర్సులకు అదనంగా కొత్త స్కిల్స్ అందించే దిశగా బీఆర్‌ఏఓయూ ప్రయత్నిస్తోంది.
- ప్రొ. పల్లవి కాబ్డే
డైరెక్టర్, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ వొకేషనల్
ట్రైనింగ్ సెంటర్, బీఆర్‌ఏఓయూ
