ప్రాణాలు పోయినా ప్రాజెక్టుకు భూములు ఇవ్వం.. గ్రామసభను బహిష్కరించిన ఉమామహేశ్వర ప్రాజెక్ట్ రైతులు

ప్రాణాలు పోయినా ప్రాజెక్టుకు భూములు ఇవ్వం.. గ్రామసభను బహిష్కరించిన ఉమామహేశ్వర ప్రాజెక్ట్  రైతులు

అచ్చంపేట, వెలుగు: వందల సంవత్సరాలుగా పంటలు సాగుచేస్తూ జీవిస్తున్న పేద రైతుల భూములను  ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో బలవంతంగా  తీసుకోవడం ఏమిటని, తమ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని అధికారులకు రైతులు తేల్చి చెప్పారు. 

నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు తెలపడంతో పాటు వారి అభిప్రాయాలను తీసుకునేందుకు  మంగళవారం బల్మూర్ మండల కేంద్రంలో భూ నిర్వాసిత రైతుల గ్రామసభను నిర్వహించారు. 

అడిషనల్ కలెక్టర్ అరుణారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్ హాజరై రైతుల అభిప్రాయాలను సేకరించారు. భూ నిర్వాసిత రైతులు ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని నిర్వాసిత రైతులు గ్రామసభను బహిష్కరించారు. రైతుల అభిప్రాయం మేరకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, బలవంతపు భూసేకరణ చేయొద్దని సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు.

 ప్రస్తుత డిజైన్లు మార్చి రామగిరి వద్ద లేదా తెగిన చెరువు దగ్గర రిజర్వాయర్ నిర్మాణం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.  సర్పంచ్ శిరీష, ఉప సర్పంచ్ సీతారాం రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి  శంకర్ నాయక్  పాల్గొన్నారు.