- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు: కృష్ణా జలాలతోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మహబూబ్‌నగర్ నగరంలోని ధర్నా చౌక్‌లో మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు హాజరై మాట్లాడారు.
పాలమూరు బీళ్లకు కృష్ణా జలాలు పారితేనే పంటలు పండి వలసలు తగ్గుతాయని, కూలీలకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. కృష్ణా జలాల్లో పాలమూరుకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం గతంలో జలసాధన ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉన్నా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. డిండి లిఫ్ట్ స్కీమ్‌కు పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని తరలించడం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడమే అవుతుందన్నారు.
పాలమూరు ప్రజల సాగునీటి పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వంతో చర్చించి పాలమూరు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తానని, పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నష్టం కలిగించే డిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి, ఉదండాపూర్ నుంచి కెనాల్, లిఫ్ట్ పనులు పూర్తి చేయాలని, ఆర్డీఎస్ వాటా నీటిని పొలాల్లోకి పారించాలన్నారు. పాలమూరు అధ్యనయ వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి పాల్గొన్నారు.
