- స్కూల్ గేమ్స్ నిర్వహణకు పక్కా ప్లాన్
- పీఈటీలు, పీడీలకు స్పెషల్ సూట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బడుల్లో క్రీడల నిర్వహణను ప్రక్షాళన చేసేందుకు సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా స్పోర్ట్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఐదుగురు సీనియర్ పీడీలు, పీఈటీలతో కూడిన ఈసెల్, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ గేమ్స్ నిర్వహణను పర్యవేక్షించనుంది. డైరెక్టరేట్‌లో కొత్తగా వచ్చే సీనియర్ పీడీల టీమ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో తోడ్పాటునందించనుంది. క్రీడల క్యాలెండర్ తయారీ నుంచి టోర్నమెంట్ల నిర్వహణ, క్రీడాకారుల ఎంపిక, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు అంతా ఈ సెల్ పర్యవేక్షణలోనే జరగనుంది. క్షేత్రస్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, క్రీడా నిధులను సక్రమంగా వినియోగించేలా చూడటం వీరి ప్రధాన బాధ్యతగా అప్పగించనున్నారు.
పీఈటీలకు సూట్..
ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారు స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లోని పీఈటీలు, పీడీలకు సర్కారు ప్రత్యేకంగా స్మార్ట్ సూట్లను అందించనున్నది. వాటిల్లో పీఈటీలు, పీడీలు ప్రొఫెషనల్‌గా కనిపించాలని, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సూట్లను కేవలం ఆటల సమయంలోనే కాకుండా, ప్రతిరోజూ స్కూల్‌కు అటెండ్ అయ్యేటప్పుడు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. యూనిఫాంలో ఉంటేనే వారిలో బాధ్యత, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు..
స్కూల్ గేమ్స్ పేరిట సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల దందాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విద్యాశాఖ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇకపై క్రీడలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. మండలం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు విద్యార్థులు పాల్గొనే ఆటల వివరాలు, వారి విజయాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీంతో ఏ విద్యార్థి ఎక్కడ ఆడారు? ఏ మెడల్ సాధించారు? అనే డేటా స్పష్టంగా ఉంటుంది. గతంలో మ్యాన్యువల్ సర్టిఫికెట్లతో జరిగిన అక్రమాలకు ఈ డిజిటల్ విధానంతో చెక్ పడనుంది.
