ముంబై: ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాషా పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం మరింత ముదిరింది. ఈ నిబంధన పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆరోపిస్తూ ముంబైకి చెందిన నలుగురు క్యాబ్ డ్రైవర్లు బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
న్యాయవాది వివేక్ శుక్లా ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. ఆగస్టు12 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్‌పై స్టే విధించాలని కోరారు. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, వృత్తి స్వేచ్ఛ, జీవించే హక్కులను హరిస్తోందని, ఎంవీ యాక్ట్‌కు అతీతమని వాదించారు. మరోవైపు, మరాఠీయేతర డ్రైవర్ల కోసం రవాణా శాఖ తనిఖీలను ప్రారంభించింది. 1989 నాటి ఈ నియమాన్ని కఠినంగా అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు.
