- ఆఫీసర్లపై యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆగ్రహం
యాదాద్రి, వెలుగు: కంపెనీల్లో రియాక్టర్లు పేలి కార్మికుల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారని పీసీబీ, ఫ్యాక్టరీ, ఫైర్ ఆఫీసర్లపై యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని దోతిగూడెంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు కార్మికులు చనిపోవడంతో కలెక్టరేట్లో మంగళవారం అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. వరుసగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా సీరియస్‌గా తీసుకోరా? అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తమైతే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
ఫార్మా పరిశ్రమల్లోని రియాక్టర్ల పనితీరుతో పాటు ప్రొడక్ట్ శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్‌లు నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమల యాజమాన్యాలు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ కన్సల్టెంట్ ద్వారా భద్రతా ధ్రువీకరణ పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాలోపాలపై చేపట్టిన చర్యల రిపోర్ట్‌ను పది రోజుల్లోగా అందించాలన్నారు. ప్రజలు, కార్మికుల ప్రాణ రక్షణ విషయంలో రాజీపడేదీ లేదన్నారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కర్‌రావు, ఆర్డీవో శేఖర్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమలు అధికారి పడాల రవీందర్ ఉన్నారు.
