చార్మినార్, వెలుగు: రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కలకలం రేపిన భారీ దొంగతనం కేసును టాస్క్ ఫోర్స్ చార్మినార్ జోన్, రెయిన్ బజార్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఇద్దరు బాలురు ఈ చోరీకి పాల్పడినట్లు తేల్చామని హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ చార్మినార్జోన్అదనపు డీసీపీ శ్రీనివాసరావు, రెయిన్ బజార్ సీఐ నేతాజీ తెలిపారు.
యాకుత్‌పురాకు చెందిన 16, 15 సంవత్సరాల వయస్సు గల బాలురు గేమింగ్ జోన్లలో డబ్బులు పెట్టి ఆడేందుకు అలవాటు పడ్డారు. వ్యక్తిగత ఖర్చులు, గేమింగ్ వ్యసనం కోసం డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని స్కెచ్వేశారు. ఈ నెల 21న అర్ధరాత్రి రెయిన్ బజార్ పరిధిలోని ఓ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు.
వెంటనే భవనం టెర్రస్ పైకి ఎక్కి, మెట్ల మార్గంలో లోపలికి ప్రవేశించి బంగారు ఆభరణాలు, మన కరెన్సీతోపాటు విదేశీ కరెన్సీని చోరీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18 లక్షల విలువైన 124.67 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25 వేల భారతీయ, రూ.12 వేల విలువైన విదేశీ కరెన్సీతోపాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.
