పార్ట్ టైమ్ జాబ్ పేరుతో రూ.14 లక్షలు టోకరా.. హైదరాబాద్ సీతాఫల్ మండిలో సైబర్ మోసం

పార్ట్ టైమ్ జాబ్ పేరుతో రూ.14 లక్షలు టోకరా.. హైదరాబాద్ సీతాఫల్ మండిలో సైబర్ మోసం

పద్మారావునగర్, వెలుగు: ఆన్‌‌లైన్ పార్ట్‌‌టైమ్ ఉద్యోగం, టెలిగ్రామ్ టాస్క్‌‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ ఫిట్‌‌నెస్ ట్రైనర్‌‌ను బురిడీ కొట్టించి, రూ.14 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్ సీతాఫల్‌‌ మండికి చెందిన చల్లబోయిన ధనేశ్వర్ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో వచ్చిన పార్ట్‌‌టైమ్ జాబ్ ప్రకటన చూసి సంప్రదించగా, నిందితులు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ గ్రూపుల్లోకి చేర్చారు.

తొలుత గూగుల్ మ్యాప్స్ రేటింగ్స్, చిన్నపాటి ప్రీపెయిడ్ టాస్క్‌‌ల పేరుతో కొంత నగదును అతడి ఖాతాలో జమ చేసి, నమ్మకం కలిగించారు. ఆ తర్వాత ఫేక్ ట్రేడింగ్ వెబ్‌‌సైట్‌‌లో రిజిస్టర్ చేయించి, భారీ లాభాల ఆశ చూపి విడతలవారీగా రూ.14,02,201 డిపాజిట్ చేయించుకున్నారు.

నగదు విత్‌‌డ్రా చేసుకునే సమయానికి ఖాతా ఫ్రీజ్ అయిందని, రూ.3.99 లక్షలు ట్యాక్స్​చెల్లించాలన్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.