హైదరాబాద్ లో ' స్వీట్స్, హాట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు..బాచుపల్లిలో 'బర్ఫీ ఘర్' లైసెన్స్ సస్పెండ్, సీజ్

హైదరాబాద్ లో ' స్వీట్స్, హాట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు..బాచుపల్లిలో 'బర్ఫీ ఘర్' లైసెన్స్ సస్పెండ్, సీజ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరంలో స్వీట్, హాట్ ఫుడ్ సెంటర్లు, కిచెన్లలో టీజీ సేఫ్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మంగళవారం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 32 కేంద్రాల్లో 15 ప్రత్యేక బృందాలతో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా చాలా కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా బాచుపల్లిలోని 'బర్ఫీ ఘర్' సంస్థ లైసెన్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తుండటంతో, దాని లైసెన్స్‌‌ను సస్పెండ్ చేసి సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 లక్షల విలువైన 15 టన్నుల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

తయారీ కేంద్రాల్లో తీవ్రమైన అపరిశుభ్రత, గడువు ముగిసిన సరుకులు, నిల్వ చేయడంలో అశ్రద్ధ, బూజు పట్టిన కూరగాయలు, ఎలుకలు, పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ ప్యాకేజింగ్, లేబులింగ్ నిబంధనలు పాటించకుండా తప్పుడు ప్రచారాలతో కస్టమర్లను మోసం చేస్తున్నట్లు నిర్ధారించారు. మొత్తం 35 రకాల ఫుడ్ శాంపిల్స్‌‌ను సేకరించి ల్యాబ్‌‌కు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో 12 సంస్థలకు ఇంప్రూవ్‌‌మెంట్ నోటీసులు, నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రకటించారు.