పెగడపల్లి, వెలుగు: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ప్రగడపల్లి మండలంలోని పెగడపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డు పంపిణీ చేశారు.
అనంతరం కేజీబీవీని సందర్శించి మౌలిక వసతులపై ఆరా తీశారు. పెగడపల్లి మండల వెలుగు దినపత్రిక విలేకరి మాసూరి తల్లి సుశీల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, సర్పంచ్ అరుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి, మాజీ జడ్పీటీసీ రాజేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
