- 794 స్కూళ్లలో తనిఖీలకు విద్యాశాఖ ఆదేశాలు
- గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా పనుల పురోగతిపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) బడుల అభివృద్ధిపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా ఎంపిక చేసిన 794 స్కూళ్లలో పనుల పురోగతిని పరిశీలించేందుకు 15 మంది సీనియర్ అధికారులను స్టేట్ లెవెల్ రివ్యూయర్లుగా నియమించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోని పీఎంశ్రీ స్కూళ్లను రివ్యూయర్లు క్షేత్రస్థాయిలో సందర్శించనున్నారు. బడుల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలిస్తారు. రికార్డులకే పరిమితం కాకుండా హెడ్‌మాస్టర్లు, టీచర్లు, విద్యార్థులు, ఇతర భాగస్వాములతో మాట్లాడి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేయనున్నారు. బడుల్లోని రిజిస్టర్లు, డేటాను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని అంచనా వేయనున్నారు.
నాణ్యత, పరిమాణాత్మక అంశాలపై సమీక్ష పూర్తయ్యాక.. అదే రోజు నివేదికను పీఎంశ్రీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని డైరెక్టర్ ఆదేశించారు. రివ్యూయర్లు బడులకు వచ్చినప్పుడు జిల్లా డీఈవోలు, ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు రాధారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరికి రమణకుమార్, రంగారెడ్డికి పీవీ శ్రీహరి, సిద్దిపేటకు కే. లింగయ్యను రివ్యూయర్లుగా నియమించారు. కరీంనగర్, ములుగు, గద్వాల జిల్లాలకు ఉషారాణి, మహబూబ్‌నగర్, వనపర్తికి శ్రీనివాసచారి, సంగారెడ్డికి జి. రమేశ్బాధ్యతలు అప్పగించారు. వికారాబాద్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలను ఎం. సోమిరెడ్డి, యాదాద్రి, జగిత్యాల జిల్లాలను కే. సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షించనున్నారు.
