- ఐక్యరాజ్యసమితి వేదికపై తెలంగాణ విద్యా సంస్కరణలు
- ఢిల్లీలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా
హైదరాబాద్, వెలుగు: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్‌ఎన్) అనేది ఏదో ఒక అదనపు పని లేదా కార్యక్రమం కాదనీ, అది మనం తీసుకునే శ్వాస వంటిదని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన లైట్‌హౌస్ ఇండియా ఇమ్మర్షన్ 2026 సదస్సులో తెలంగాణ నుంచి యోగితారాణా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బడుల్లో సాధించిన అద్భుత ఫలితాలను వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక సదస్సులో తెలంగాణ అనుభవాలను ప్రపంచ దేశాలకు వివరించాలని తనకు ఆహ్వానం లభించిందని వెల్లడించారు.
ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూళ్లపై ఫోకస్
వెనుకబడిన పిల్లల కోసం ప్రతిరోజూ గంట పాటు అదనపు బోధన చేపడుతున్నామని, దీంతో విద్యార్థుల సామర్థ్యం పెరిగిందని యోగితారాణా అన్నారు. తెలుగు చదివే పిల్లల శాతం 9 నుంచి 35కు, ఇంగ్లిష్‌లో 4 నుంచి29 శాతానికి, ఉర్దూలో 19 నుంచి 40 శాతానికి పెరిగిందన్నారు. గణితంలోనూ 18 నుంచి 30 శాతానికి విద్యార్థులు పెరిగారని వివరించారు. రాష్ట్రంలో 5,311 పాఠశాలలను ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూళ్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేష్, నల్గొండ డీఈఓ సుశీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
