- రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి చేసిన సుమంత్
- బాధితుడి ఫిర్యాదును పట్టించుకోని సీఐ ముత్తు యాదవ్
- చర్యలు తీసుకున్న సీపీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 20న సుమంత్ ఓ రియల్టర్‌పై దాడి చేయగా, కేసు నమోదు చేయకపోవడంతో సీపీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మూడు వారాల క్రితమే ఆయన జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. బోడుప్పల్ ఆర్టీసీ కాలనీ పార్క్ విల్లాస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ(36)తో రూ.18 కోట్ల వ్యవహారంలో సుమంత్‌కు గొడవలు ఉన్నాయి.
గత నెల 30న హరికృష్ణను జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–-1లోని తన కార్యాలయానికి సుమంత్ పిలిపించాడు. మరో ఆరుగురితో కలిసి ఇనుప రాడ్డుతో హరికృష్ణపై దాడి చేయగా, ఎడమ చేయి విరగడంతోపాటు తీవ్ర రక్తస్రావమైంది. అదే రోజు సుమంత్ డయల్ 100కు ఫోన్ చేసి గుర్తుతెలియని వ్యక్తి తమ ఫ్లాట్‌లోకి చొరబడి దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సుమంత్ కార్యాలయానికి వెళ్లారు. గాయాలతో ఉన్న హరికృష్ణను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినా, అక్కడ ఉన్న ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్ కనీస సమాచారం సేకరించలేదు.
మేడిపల్లి నుంచి జీరో ఎఫ్‌ఐఆర్
జూబ్లీహిల్స్ సీఐ పట్టించుకోకపోవడంతో హరికృష్ణ ఈ నెల 20న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి జూబ్లీహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఘటన జరిగిన రోజే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం, కేసు బదిలీ అయిన తర్వాత కూడా సుమంత్‌ను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం చేసినట్టు గుర్తించారు. సుమంత్ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి కొల్లూరు ఉస్మాన్‌నగర్‌లోని ఓజోన్ హైట్స్‌లో ఆయన నివాసానికి శనివారం రాత్రి వెళ్లినా అందుబాటులో లేడు. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దాడిలో పాల్గొన్న బత్తిని అరుణ్‌కుమార్, ముత్యాల మహేందర్‌రెడ్డి, పసుపులేటి కార్తీక్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా మార్టూరులో గత వారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సుమంత్‌తో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
