సెప్టెంబర్ 19 నుంచి సింగపూర్ స్టడీ టూర్కు రెండో టీమ్..29 మంది టీచర్ల వివరాలు వెల్లడించిన విద్యాశాఖ

సెప్టెంబర్ 19 నుంచి  సింగపూర్ స్టడీ టూర్కు రెండో టీమ్..29 మంది టీచర్ల వివరాలు వెల్లడించిన విద్యాశాఖ

హైదరాబాద్‌‌, వెలుగు: స్కూల్‌‌ టీచర్లకు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘టీచర్స్‌‌ ఎక్స్‌‌పోజర్‌‌ విజిట్‌‌’లో భాగంగా రెండో టీమ్‌‌ వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. 40 మంది టీచర్లతో కూడిన ఈ టీమ్‌‌ సెప్టెంబర్‌‌ 19 నుంచి 26 వరకు సింగపూర్‌‌లో పర్యటించనుంది. ఇందులో 29 మంది టీచర్ల డేటాను తాజాగా రిలీజ్‌‌ చేసింది. 

ఈ టీమ్‌‌లో ఏడుగురు హెడ్‌‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, ఎనిమిది మంది స్కూల్‌‌ అసిస్టెంట్లు, 11 మంది సెకండరీ గ్రేడ్‌‌ టీచర్లు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు పీజీటీలు, ఒక టీజీటీ ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్‌‌లోని స్కూళ్లను సందర్శించి.. అక్కడి గ్లోబల్‌‌ బెస్ట్‌‌ ప్రాక్టీసెస్‌‌, బోధనా పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పర్యటనకు ఎంపికైన టీచర్లు వెంటనే సంబంధిత అధికారుల నుంచి నో అబ్జెక్షన్‌‌ సర్టిఫికేట్‌‌ (ఎన్‌‌ఓసీ) తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. కాగా, సెప్టెంబర్‌‌ 12 నుంచి 19 వరకు 40 మంది టీచర్లతో కూడిన తొలి టీమ్‌‌ సింగపూర్‌‌లో పర్యటించనుంది.