- నిమ్స్ టారిఫ్‌లనే టిమ్స్‌లోనూ అమలు చేయాలని సర్కార్ యోచన
- ఈహెచ్ఎస్ స్కీమ్ చార్జీలతో సమానంగా ఉండేలా కసరత్తు
- నిమ్స్‌లో అమల్లోకి వస్తే పెరగనున్న చికిత్సల ధరలు
- వారం పది రోజుల్లో నిమ్స్ ఈసీ సమావేశం
- అప్పుడే తుది నిర్ణయం తీసుకునే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయిన నిమ్స్, టిమ్స్‌లలో ఒకే విధమైన వైద్య ఫీజుల(ఏకరూప టారిఫ్) విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంట్రల్ గవర్నమెట్ హెల్త్ స్కీమ్(సీజీహెచ్ఎస్) నిర్దేశించిన రేట్లను ప్రామాణికంగా తీసుకుని నిమ్స్, టిమ్స్‌తో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) చార్జీలను కూడా ఒకే తాటిపైకి తెచ్చేందుకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈహెచ్ఎస్ స్కీమ్‌కు సీజీహెచ్ఎస్ రేట్లను ఖరారు చేసిన సర్కారు.. ఇప్పుడు నిమ్స్, టిమ్స్‌లలోనూ అవే రేట్లను వర్తింపజేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మంగళవారం సనత్‌నగర్ టిమ్స్ తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ మంత్రి దామోదర్ రాజనర్సింహా అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్‌లో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
నిమ్స్‌లో పెంచాకే టిమ్స్‌లో అమలు?
ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌లో వసూలు చేస్తున్న టారిఫ్ రేట్లు.. సీజీహెచ్ఎస్ రేట్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిమ్స్‌లో కూడా సీజీహెచ్ఎస్ రేట్లను అడాప్ట్ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే నిమ్స్‌లో వివిధ వైద్య పరీక్షలు, సర్జరీలు, చికిత్సల ధరలు పెరిగే అవకాశముంది. మరో వారం పది రోజుల్లో నిమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశం జరగనుండగా, అందులో సీజీహెచ్ఎస్ రేట్ల అమలుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిమ్స్ టారిఫ్‌లు ఖరారై పెరిగిన తర్వాతే.. వాటిని టిమ్స్‌కు అనుసంధానించి అక్కడ కూడా పూర్తిస్థాయి చికిత్సలు, సర్జరీలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై మంగళవారం జరిగిన డాక్టర్ సీఆర్ టిమ్స్ ఈసీ సమావేశంలోనూ ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.
సర్వీస్ రూల్స్ కూడా సేమ్..
డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్‌నే అనుసరించాలని, అలాగే నిమ్స్‌లో అమలులో ఉన్న టారిఫ్‌లనే టిమ్స్‌లోనూ అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హాస్పిటల్ ప్రారంభ దశ నుంచే పటిష్టమైన టారిఫ్ విధానం ఉండటం వల్ల రెండు ప్రధాన వైద్య సంస్థల మధ్య చార్జీల విధానంలో ఏకరూపత రావడంతో పాటు ఆర్థిక ప్రణాళిక పారదర్శకంగా ఉంటుందని ఈసీ అభిప్రాయపడింది. అలాగే టిమ్స్ ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్(టీఆర్ఏ) ద్వారా నిర్వహించేందుకు అవసరమైన బ్యాంకింగ్ సేవల సమన్వయానికి కూడా ఈసీ ఆమోదం తెలిపింది.
