సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ టిమ్స్‌‌‌‌‌‌‌‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్, పీజీ హాస్టల్స్..నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం

సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ టిమ్స్‌‌‌‌‌‌‌‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్, పీజీ హాస్టల్స్..నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం
  •     మొత్తం 2,360 పోస్టులు మంజూరు
  •     మంత్రి దామోదర అధ్యక్షతన టిమ్స్ తొలి ఈసీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సమావేశం మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవల విస్తరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నిమ్స్ సర్వీస్ రూల్స్, టారిఫ్ విధానాన్ని ఇకపై టిమ్స్ లోనూ అమలు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 

అలాగే, ఆసుపత్రి ఆర్థిక లావాదేవీల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (టీఆర్ఏ) ఏర్పాటుకు అంగీకరించారు. రోగులు, వైద్య సిబ్బంది సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా మల్టీ-లెవెల్ కార్ పార్కింగ్, అదనపు టాయిలెట్లు, పీజీ విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోజువారీగా ఓపీ సేవలు అందుతుండగా.. ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి సర్జరీలు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌‌‌‌‌‌‌‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, డీఎంఈ డాక్టర్ వాణి, డీపీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

772 రెగ్యులర్ పోస్టుల భర్తీ వేగవంతం

సనత్‌‌‌‌‌‌‌‌ నగర్ టిమ్స్ కోసం ప్రభుత్వం మొత్తం 2,360 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 1,588 అవుట్ సోర్సింగ్ పోస్టులు కాగా, 772 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈసీ సమావేశంలో నిర్ణయించారు. వీటికి సంబంధించి గతంలోనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ, రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ నోటిఫికేషన్ విడుదలకు ముందు మరోసారి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది. ప్రక్రియను త్వరగా ముగించి, ఆల్ ఇండియా స్థాయిలో నియామక నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.