మా ఫ్లెక్సీలు తీసేసి... డబ్బింగ్ మూవీ ఫ్లెక్సీలు పెడుతున్నారు: అంత చులకన ఎందుకు? తెలుగు హీరో ఆవేదన

మా ఫ్లెక్సీలు తీసేసి... డబ్బింగ్ మూవీ ఫ్లెక్సీలు పెడుతున్నారు: అంత చులకన ఎందుకు? తెలుగు హీరో ఆవేదన

కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. అయితే ‘టాక్సిక్’ డబ్బింగ్ సినిమా కావడంతో, దీనికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై ఇప్పుడు తెలుగు సినిమా వర్గాల్లో చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. 

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో  దీప్తి నడిమింటి నిర్మించిన చిత్రం ‘కికు  చిరంజీవి’. ఈనెల 28న సినిమా విడుదల  కానుంది. మంగళవారం ప్రీ  రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు అలీ భార్య   జుబేదా అలీ.. ట్రైలర్ ఇంటరెస్టింగ్‌‌గా ఉందని, సినిమా పెద్ద సక్సెస్ కావాలని  కోరారు.

ఈ సందర్భంగా  కికు యనమల మాట్లాడుతూ.. “మా సినిమా ఫ్లెక్సీలను కొన్ని థియేటర్లలో తీసేసి మరో పెద్ద సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆ సినిమా డబ్బింగ్ మూవీ. పెద్ద సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు. కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి. మన తెలుగు సినిమాలను ఎందుకు సపోర్ట్ చేయరు?” అని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం ‘టాక్సిక్’కు భారీ స్థాయిలో థియేటర్లు కేటాయిస్తున్న నేపథ్యంలో కికు యనమల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారీ క్రేజ్ ఉన్న డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎక్కువగా దక్కుతున్న సమయంలో, చిన్న మరియు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు సరైన థియేటర్లు లభించకపోవడం పరిశ్రమలో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉంది.

అయితే థియేటర్ల సంఖ్యపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ సినిమాపై పూర్తి నమ్మకం ఉందని కికు యనమల స్పష్టం చేశారు. “ఎవరు సపోర్ట్ చేయకపోయినా మేం భయపడేది లేదు. మా కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని ఆయన అన్నారు. ప్రస్తుతం హీరో కికు యనమల మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొత్తానికి ‘టాక్సిక్’ వంటి భారీ క్రేజ్ ఉన్న డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడం ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ‘కికు చిరంజీవి’కి విడుదల సమయంలో ఎన్ని థియేటర్లు దక్కుతాయో, ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.

‘కికు  చిరంజీవి’ కథలో ఒక డేరింగ్ రిస్కీ ఎలిమెంట్ ఉందని, అది నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతకు దర్శకుడు  శుభ సాయి వెంకట్ థ్యాంక్స్ చెప్పాడు.  మంచి సినిమా చేశామనే నమ్మకంతో  ఉన్నామని నిర్మాత దీప్తి నడిమింటి అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.