పాలకులు మారుతున్నా.. బీసీల వాటా దక్కట్లే : రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు

పాలకులు మారుతున్నా.. బీసీల వాటా దక్కట్లే : రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు
  •     రిజర్వేషన్లు దానం కాదు.. న్యాయమైన వాటా: రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు
  •     కులగణనలో ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలి
  •     ‘హాఫ్ డెమోక్రసీ’ నుంచి సకల జనుల ప్రజాస్వామ్యం వైపు సాగాలని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ వర్గాలకు జనాభా మేరకు రాజకీయ వాటా దక్కలేదని రిటైర్డ్ డీజీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త పూర్ణచందర్ రావు అన్నారు. బీసీలు ఉద్యోగ, విద్యా రంగాల్లో కొంత ముందుకు రావడానికి మండల్ కమిషన్ చారిత్రక పునాది వేసిందని చెప్పారు. బీపీ మండల్ నివేదిక, శరద్ యాదవ్, కాన్షీరామ్ తదితరుల ఉద్యమాల ఫలితంగానే వీపీ సింగ్ ప్రభుత్వం 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసిందని గుర్తుచేశారు. 

మంగళవారం బీపీ మండల్ జయంతి సందర్భంగా నందిగామలో నిర్వహించిన ‘బహుజన మాట-పాట’ కార్యక్రమంలో పూర్ణచందర్ రావు మాట్లాడారు. ‘‘రిజర్వేషన్ ప్రత్యేక సౌకర్యం కాదు.. వ్యవస్థలో వాటా దక్కని వారికి వాటా కల్పించే ప్రక్రియ’’ అని అన్నారు. రాబోయే జనగణనలో బీసీ కులాల లెక్కింపు పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కులాలను గుర్తిస్తున్నట్లే ప్రతి బీసీ కులానికీ ప్రత్యేక కోడ్ ఇవ్వాలని కోరారు. కులాలవారీగా జనాభా వివరాలను బహిర్గతం చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో బీసీలు జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం అందుకు అనుగుణంగా లేదని పూర్ణచందర్ రావు అన్నారు. 

అనేక బీసీ కులాలు, బీసీ ముస్లిం వర్గాలకు ఇప్పటికీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. మహిళలు, ఆదివాసీలు, దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాజకీయ చర్చలోకి తీసుకురావాలని కోరారు. ‘జగన్ వస్తారా.. చంద్రబాబు వస్తారా అన్నది బహుజన రాజకీయాల్లో ప్రధాన ప్రశ్న కాకూడదు. ఎవరు అధికారంలోకి వచ్చినా బహుజనుల వాటా ఎంత పెరిగిందన్నదే కొలమానం కావాలి’ అని అన్నారు. అంబేద్కర్ బోధించిన రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవులు విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా సాగాలని పిలుపునిచ్చారు. ‘‘ఓటు అందరిదీ అయినప్పుడు అధికారం కూడా అందరిదీ కావాలి. అప్పుడే హాఫ్ డెమోక్రసీ పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంగా మారుతుంది’’ అని పూర్ణచందర్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ విజయకుమార్, బక్క పరంజ్యోతి, వీరవల్లి శ్రీనివాస్, పొట్లూరి దేవితో పాటు పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.