హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య కొనసాగింపు, ఆవశ్యకతపై అధ్యయనం చేయడానికి పలువురు విద్యావేత్తలు, పార్టీ నాయకులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 తీసుకువచ్చి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను తీసుకురావడంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని, స్కిల్ యూనివర్సిటీ నుంచి ప్రమోటర్లు తప్పుకుంటే తమ భవిష్యత్ ఏమవుతుందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పాలిటెక్నిక్ ను ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగించడం, జీవో 97తో తలెత్తే దుష్పరిణామాలు, శక్తి (కార్మిక శాఖ) పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను చేర్చితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయనే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కవిత మంగళవారం ప్రకటించారు. కమిటీ సభ్యులు వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇందులో దూగుంట్ల నరేశ్ ప్రజాపతి, మోరం వీరభద్రారావు, సురభి, కొంగర ధరణి రాణి, కోట్ల మహేందర్ రెడ్డి, ఊదరి చంద్రమోహన్ గౌడ్, నడిపల్లి వెంకటేశ్వర్ రావులను సభ్యులుగా ఉన్నారు.
