ఉప్పు, నిప్పులా ఉండే అమెరికా–రష్యా మధ్య ఊహించని పరిణామాలు జరుగుతున్నాయా..? శత్రువులు మిత్రులవుతున్నారా..? లేక కయ్యానికి కాలు దువ్వేందుకు ఏకంగా శత్రు దేశంలో ల్యాండయ్యారా..? ఇప్పుడు ప్రపంచ దేశాలలో నెలకొన్న ప్రశ్నలు ఇవి. అమెరికా యుద్ధ సైనిక రవాణా విమానం (మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్) 2026 ఆగస్టు 25న రష్యాలో దిగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫ్లైట్ ట్రేడర్ర రిపోర్ట్ ప్రకారం.. బోయింగ్ సీ–17 గ్లోబ్ మాస్టర్ 3–ఎ అనే సైనిక, మిలిటరీ రవాణా విమానం.. రష్యాలో ల్యాండ్ అయ్యింది. అమెరికా మిలిటరీ సామాగ్రి, సైనికులను సుదూర ప్రాంతాలకు రవాణా చేసే విమానం దిగటం పలు ఊహాగానాలకు తావిస్తోంది.
ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండగా అమెరికా విమానం రష్యాలో దిగటం కీలక పరిణామంగా మారింది. ఉదయం 8.50 గంటలకు లాత్వియా రాజధాని రిగాలో టేక్ ఆఫ్ అయ్యి.. 10 గంటలకు రష్యా రాజధాని మాస్కోల్ దిగింది. అయితే దీనిపై అమెరికా కానీ, రష్యా గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు తమకు ఎలాంటి సమాచారం లేదని రష్యా చెప్పింది.
మాస్కోలో యూఎస్ మిలిటరీ జెట్ ఎందుకు దిగినట్లు..?
అమెరికా సైనిక జెట్ మాస్కోలో ఎందుకు దిగింది? అనే చర్చలు కొనసాగుతున్నాయి. యూఎస్ ఆండ్రూస్ వైమానిక దళ స్థావరం నుంచి బయలు దేరిన జెట్.. ఆగస్టు 23న రీగాకు చేరుకుంది. ఇది అమెరికా కీలక సైనిక స్థావరాలలో ఒకటి. ఇక్కడే యూఎస్ అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉంటుంది. ఈ భారీ సైనిక రవాణా విమానం రష్యాలో అకస్మాత్తుగా దిగడం అనేక ఊహాగానాలకు దారితీసింది.
అయితే ఆ జెట్ లో ఉన్నత స్థాయి అమెరికా అధికారి ఎవరూ లేరని తెలుస్తుంది. ఉన్నత స్థాయి అధికారుల అధికారిక పర్యటనలకు ముందు సిబ్బంది, వాహనాలు, కమ్యూనికేషన్ పరికరాలు, ఇతర లాజిస్టికల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇలాంటి విమానాలను పంపటం సహజం. గతంలో హైయర్ అఫీషియల్స్ పర్యటన ముందు అలాగే చేశారు.
అయితే రష్యా– ఉక్రెయిన్ వివాదంపై దౌత్యపరమైన చర్చల కోసం అమెరికా అధికారిక కార్యవర్గం వస్తుందేమోననే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ మధ్య దౌత్యం స్తంభించిపోయింది. ఈ క్రమంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాస్కో పర్యటనకు వెళ్తున్నారనే ఊహాగానాలు గత కొన్ని వారాలుగా జోరుగా సాగుతున్నాయి.
ఇరు దేశాల మధ్య యుద్ధ విరమణ కోసం డొనాల్డ్ ట్రంప్ కొన్నాళ్లు ప్రయత్నించినప్పటికీ.. తన దృష్టిని ఇరాన్ యుద్ధం వైపు మళ్లించడంతో ఆ చర్చలు అలాగే ఉండిపోయాయి. గత వారం, అమెరికా, యూరోపియన్ అధికారులు మాస్కో కోసం ఒక కొత్త ప్రతిపాదనను సిద్ధం చేశారనే వార్తలు వచ్చాయి.
వార్ అండ్ మిలిటరీ న్యూస్ అనే మరో సైట్, ఉక్రెయిన్ యుద్ధంపై మరో విడత చర్చల కోసం అమెరికా ప్రత్యేక రాయబారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్‌లు మాస్కోలో పర్యటించనున్నారనే అంచనాతో గ్లోబ్‌మాస్టర్ రాకకు సంబంధం ఉండవచ్చని భావిస్తున్నారు.
