- చాక్లెట్ ఆశ చూపి ఇద్దరు చిన్నారుల కిడ్నాప్
- బెంగాల్‌కు తీసుకెళ్లి అమ్మేయాలని ప్లాన్
- 4 గంటల్లోనే రక్షించిన పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: లేబర్ క్యాంపులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి అదే క్యాంపులో పనిచేసే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. వారిని పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్లి విక్రయించేందుకు ప్లాన్ చేశాడు. పోలీసులు 4 గంటల్లోనే నిందితుడిని గుర్తించి చిన్నారులను రక్షించారు.
అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మంగళవారం తన ఆఫీస్‌లో వివరాలు వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన డేవిడ్ముర్ము భార్య, కూతురి(4)తో, మేరి మరండి తన కుమార్తె(3)తో కలిసి నగరానికి వలస వచ్చి కొండాపూర్‌లోని కేఎల్సీ కన్‌స్ర్టక్షన్స్ లేబర్ క్యాంపులో ఉంటూ కూలీలుగా పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆడుకుంటున్న ఈ ఇద్దరు చిన్నారులకు చాక్లెట్ ఆశ చూపి, అదే క్యాంపులో పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన చాకు సోరెన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు.
వారిని బెంగాల్‌కు తీసుకెళ్లి విక్రయించడం లేదా భిక్షాటనకు ఉపయోగించాలనేది అతని ప్లాన్. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెదిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సోరెన్క్యాంపులో లేకపోవడం, అతని ఫోన్స్విచ్ఆఫ్రావడంతో.. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సోరెన్లింగంపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైలులో ఘట్‌కేసర్ వెళ్లినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు.
ఘట్‌కేసర్, రైల్వే పోలీసుల సహకారంతో 4 గంటల్లోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సోరెన్‌పై పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే అత్యాచారం, హత్యాయత్నం కేసులున్నాయని, ఈ ఏడాదిలో మార్చిలో జైలు నుంచి బయటకు వచ్చినట్లు డీసీపీ తెలిపారు. చిన్నారులను రక్షించిన పోలీసులను ఆయన అభినందించారు.
