ఫీజు బకాయిలు ఇవ్వకుంటే సెక్రటేరియెట్ ముట్టడి : రాంచందర్రావు

ఫీజు బకాయిలు ఇవ్వకుంటే సెక్రటేరియెట్ ముట్టడి : రాంచందర్రావు
  •     రూ.15 వేల కోట్లు ఇచ్చేదాకా సర్కార్‌‌‌‌‌‌‌‌ను నిద్రపోనివ్వం: రాంచందర్​రావు 
  •     దీక్ష విరమింపజేసిన కె.లక్ష్మణ్, ఏలేటి, ఈటల
  •     5, 6 తేదీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దీక్ష: బీజేఎల్పీ నేత 

హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్, స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ల బకాయిలు రూ.15వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సర్కారు నిర్లక్ష్యం వహిస్తే.. వేలాది మంది విద్యార్థులతో కలిసి సెక్రటేరియెట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని కోరుతూ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజు మంగళవారం కొనసాగింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. దీక్షను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆరోపించారు. 

ధర్నా చౌక్ వద్ద అనుమతి నిరాకరించడమే కాకుండా, పార్టీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. వైద్య బృందాన్ని, అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ను కూడా పంపకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యకర్తల అండతో దీక్షను విజయవంతం చేశామని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా విద్యార్థుల పక్షాన పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల రాచమర్యాదలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రికి.. పేద బిడ్డల చదువుల కోసం నిధులు విడుదల చేయడానికి మనసు రావడం లేదని విమర్శించారు. రాంచందర్ రావు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువమోర్చా కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. 5 లక్షల మంది విద్యార్థుల సంతకాల పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి,  ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

అసెంబ్లీని ముట్టడిస్తాం: ఏలేటి 

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.  ట్రిపుల్ ఐటీలో 9 వేల మంది స్టూడెంట్లకు కేవలం 19 మంది ప్రొఫెసర్లే ఉండటం విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని, బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను కూడా రూ.250 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు కోత పెట్టారని దుయ్యబట్టారు. సీఎం అమెరికా పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి భారీ దీక్షలు చేపడతామని, అప్పటికీ స్పందన రాకుంటే అసెంబ్లీ ముట్టడి ఖాయమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నిరంకుశత్వం: మురళీధర్ రావు 

కాంగ్రెస్ నేతలు చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతూ.. రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బీజేపీ నేత పి. మురళీధర్ రావు విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన వ్యక్తి దీక్ష చేస్తానంటే కనీసం ధర్నా చౌక్ లో అనుమతి ఇవ్వకపోవడం ఏ రాజ్యాంగ పరిరక్షణ అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆక్స్‌‌‌‌‌‌‌‌ఫర్డ్, హార్వర్డ్ అంటూ విదేశాల్లో తిరుగుతున్నారు తప్ప ఇక్కడి విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజుల అంశం కేవలం ఆర్థిక పరమైనది కాదని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉందన్నారు. వెంటనే బకాయిలు క్లియర్ చేసి విద్యార్థుల సర్టిఫికెట్లు వచ్చేలా చూడాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.