- గతంలో 522 ఎకరాలకు అక్రమంగా ఓఆర్సీలు జారీ
- భూములను 22ఏలో చేర్చిన సర్కార్
- భూములు రక్షించడంపై రైతుల హర్షం
మెదక్/శివ్వంపేట/నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లో అన్యాక్రాంతమైన ఇనాం భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో 400 ఎకరాలు, నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 122 ఎకరాలకు అక్రమంగా ఓఆర్సీ(ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్)లు, ఎన్ఓసీలు జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వందల కోట్ల విలువైన 522 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల్లో వెంచర్లు వెలవగా, భూములు కోల్పోయిన పేద రైతులు ఆందోళన చెందారు. తాజాగా ఈ భూములను నిషేధిత జాబితా 22ఏలో చేర్చడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 22ఏ భూములపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ బాగోతాన్ని బయటపెట్టారు.
ధరణి లొసుగులను ఆసరాగా చేసుకుని..
బీఆర్‌ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని శివ్వంపేట మండలంలో వందలాది ఎకరాల ఇనాం భూములకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు జారీ చేసి పట్టాలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. మరికొన్ని గ్రామాల్లో భూమి లేకున్నా రికార్డుల్లో విస్తీర్ణం పెంచి పట్టాలు ఇచ్చారు. సికింద్లాపూర్‌లోని సర్వే నంబర్లు 33 నుంచి 87 వరకు 1954–55 కాస్రా ప్రకారం దాదాపు 430 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములను దస్తగర్ద్(ఇనాం)గా నమోదు చేశారు.
పథకం ప్రకారమే..
భూములపై హక్కులు కల్పించాలని కొందరు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. విచారణలు కొనసాగుతున్న సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రెవెన్యూ అధికారులు పథకం ప్రకారం ఇనాం రికార్డుల్లోని భూముల విస్తీర్ణాన్ని తగ్గించి కొందరికి కట్టబెట్టినట్టు ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికెట్లు(ఓఆర్సీలు) జారీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం ఒక్కొక్కరి పేరుపై 15, 20 ఎకరాల చొప్పున 400 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు తెలుస్తోంది.
200 ఎకరాల్లో వెంచర్‌కు యత్నం..
అక్రమంగా భూములు పొందిన వారు సుమారు 200 ఎకరాల్లో భారీ వెంచర్ ఏర్పాటు చేస్తున్నామంటూ బ్రోచర్లు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్లాపూర్ భూములపై ఫిర్యాదులు రావడంతో వాటిని హోల్డ్‌లో పెట్టింది. దీంతో వెంచర్ ఏర్పాటు ఆగిపోయింది. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలోని సర్వే నంబర్లు 58, 59లో సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బీఆర్‌ఎస్ హయాంలో దాదాపు 300 ఎకరాలకు రెవెన్యూ అధికారులు అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేసినట్టు తెలిసింది. ఇందులో 122 ఎకరాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ భూమిలో కొంత భాగంలో భారీ రిసార్ట్ కూడా వెలిసింది.
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్..
చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ జారీ చేసేందుకు అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఎకరాకు రూ.లక్ష చొప్పున డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చిన తర్వాత, ఎన్ఓసీ జారీ చేయకపోవడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేశ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో అప్పటి నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి తదితర రెవెన్యూ అధికారులపైనా కేసులు నమోదయ్యాయి. వారిని సస్పెండ్ చేశారు. అయితే రెండేళ్ల తర్వాత అదే భూమికి ఎన్ఓసీలు జారీ కావడం గమనార్హం.
గ్రామస్తుల ఫిర్యాదులతో కదిలిన సర్కారు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తర్వాత సికింద్లాపూర్ గ్రామస్తులు మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి ఇనాం భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. ఇటీవల వాటిని 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. చిప్పల్‌తుర్తిలో అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేసినట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో 122 ఎకరాలను 22ఏలో చేర్చారు. రెండు ప్రాంతాల్లో కలిపి 522 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని, అందుకే 22ఏలో చేర్చినట్టు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
- ‘సిట్’తో అక్రమాలపై విచారణ..
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ లావాదేవీల డిజిటల్ రికార్డులు, అధికారుల లాగిన్ వివరాలను పరిశీలించేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణి ప్రారంభమైన తర్వాత జరిగిన భూ లావాదేవీలు, రికార్డుల్లో విస్తీర్ణం పెంపు, భూముల స్వభావం మార్పు, ఎన్ఓసీలు జారీ, భూమి లేకున్నా పట్టాలు ఇవ్వడం వంటి అంశాలపై సిట్ విచారణ చేపట్టనుంది.
