మాయోపాయం పన్నకూడదు. వంచన, కుట్రలకు పాల్పడకూడదు. విశ్వాస భంగం చేయకూడదు. ఊహ తెలియని పిల్లలను చంపకూడదు. స్త్రీలను, వృద్ధులను చంపకూడదు. చిత్రవధ చేయకూడదు. ఖర్జూరపు చెట్లను, ఫలాలనిచ్చే చెట్లకునష్టం చేకూర్చకూడదు. ఇవీ ప్రవక్త ముహమ్మద్(స) యుద్ధ మైదానంలో పాటించాల్సిందిగా తన అనుచరులకు నేర్పిన యుద్ధ నియమాలు.
తన ప్రాణ శత్రువులు తనను, తన అనుచరుల్నీ చంపటం కోసం యుద్ధానికి కాలుదువ్విన సందర్భాలలో సైతం వారిని సమాధాన పరచి యుద్ధం జరగకుండా ఆపటానికి అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. శత్రువుల నుంచి ఆత్మరక్షణ కోసం తప్పనిసరిగా యుద్ధం చెయ్యాల్సి వచ్చినప్పుడు సైతం యుద్ధ మైదానంలో పాటించాల్సిన నైతిక నియమాలు నేర్పాడాయన. చివరకు యుద్ధాన్ని మానుకున్న శత్రువులను క్షమించి దయను చూపాడాయన.
ప్రజలను కాపాడేందుకే యుద్ధం
‘ప్రవక్త ముహమ్మద్ (స) అనేక యుద్ధాలు చేశారు’ అని చాలామంది చెప్పేమాట నిజానికి అవాస్తవం. ఎందుకంటే ఏ నాయకుడైనా మరొక రాజ్యంపై తన తరఫున యుద్ధం ప్రకటించేది రాజకీయ, ఆర్థిక లబ్ది కోసమే తప్ప మరొక ఉద్దేశం ఉండదు. కానీ, ప్రవక్త ముహమ్మద్ (స) చేసిన యుద్ధాలన్నీ కేవలం ఆత్మరక్షణ కోసం, దౌర్జన్యపరుల ద్వారా అణచివేతకు గురై, వారి రాజకీయ ఆధిపత్యం కింద నలిగిపోతున్న సామాన్య అమాయక ప్రజలను రక్షించటం కోసం మాత్రమే ఆయనకు యుద్ధం చేయమన్న ఆదేశాలు వచ్చాయి. ఇస్లాం మిడిమిడి జ్ఞానం కలిగిన కొందరు చెబుతున్నట్లు ప్రవక్త ముహమ్మద్ (స) చేసిన యుద్ధాలన్నీ ఇస్లాం వ్యాప్తికోసమో, ఇతర మతాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా మతమార్పిడి చెయ్యటానికో, అన్యాయంగా ముస్లిమేతరులను చంపటానికో కాదు.
ఇస్లామోఫోబియా అనే మానసిక జబ్బు కారణంగా ప్రవక్త ముహమ్మద్ (స) యుద్ధాలు చేశారన్న సమాచారం మాత్రమే కొందరి కళ్లకు కనపడుతుంది. దౌర్జన్యపరులను సైతం తాను మక్కాను జయించిన సందర్భంలో వారందరినీ క్షమించివేశాడా మనిషి. చరిత్రలో దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా ధర్మ యుద్ధాలు చేయాల్సిందిగా ఆదేశించిన అనేకమంది మహాత్ములు, మహనీయులు, ప్రవక్తలున్నారు. అది తెలియాలంటే చరిత్ర చదవాలి, ఇంకా హిందూ శాస్త్రాలను, బైబిల్ గ్రంథాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. కేవలం వాట్సాప్ మేసేజ్‌లు చదివితే సరిపోదు.
- ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్
మజ్లిస్ తహఫుజ్ ఖత్మే నబువ్వత్
రిలీజియస్ ట్రస్ట్ అధ్యక్షుడు, కరీంనగర్.
