తెలంగాణ, ఏపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలే

తెలంగాణ, ఏపీ మధ్య  ఏకాభిప్రాయం కుదరలే
  •     తెలంగాణ 112 టీఎంసీలు అడిగింది
  •     2027 ఆగస్టు వరకు కేటాయించాలని కోరింది
  •     త్రీమెంబర్​ కమిటీ మీటింగ్ ​మినిట్స్‌‌లో కృష్ణా బోర్డు 
  •     అక్టోబర్​ వరకే ఏపీ 47 టీఎంసీలు కోరింది
  •     తెలంగాణ కూడా ఆ మేరకు నీళ్లివ్వాలని పట్టుబట్టింది
  •     ఎటూ తేలకపోవడంతో సెప్టెంబర్​ 4కు మీటింగ్​ వాయిదా వేసినట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపులపై తెలంగాణ, ఏపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కృష్ణా బోర్డు వెల్లడించింది. రెండు రాష్ట్రాలు తమ తాగునీటి అవసరాలపై పట్టుబట్టడంతో నిర్ణయం వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపింది. హైదరాబాద్‌‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రీ మెంబర్​ కమిటీ మీటింగ్‌‌కు సంబంధించిన మినిట్స్‌‌ను బోర్డు మంగళవారం విడుదల చేసింది. 2027 ఆగస్టు వరకు తాగునీటి కోసం 112 టీఎంసీలు కేటాయించాల్సిందిగా తెలంగాణ ఈఎన్సీ జనరల్​ రమేశ్​ బాబు కోరారని బోర్డు పేర్కొన్నది. 

ఆ మేరకు రెండు ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఉండేలా చూడాలని కోరినట్టు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్​ దాకా తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ కోరిందని పేర్కొన్నది. దీనిపై తెలంగాణ ఈఎన్సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపింది.  ఒకవేళ ఏపీకి అక్టోబర్ వరకు 47 టీఎంసీలు ఇస్తే.. తమకూ అన్నే నీళ్లు ఇవ్వాలని లేదంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి నీటి సంవత్సరానికి తాగునీటి కేటాయింపులను ఒకేసారి తేల్చాలని స్పష్టం చేశారని వెల్లడించింది.

ఎల్‌‌నినో ముప్పు.. పొదుపుగా వాడాలని నిర్ణయం

రాబోయే నెలల్లో ‘ఎల్‌‌నినో’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, వర్షపాతం లోటు ఏర్పడే సూచనలు ఉన్నాయని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా, విచక్షణతో వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయని మినిట్స్‌‌లో బోర్డు పేర్కొన్నది. తాగునీటి అవసరాలకు తగ్గట్టుగా నీటి విడుదలను క్రమబద్ధీకరించడానికి వివిధ పద్ధతులు, ఫార్ములాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారని తెలిపింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి వాటర్​ ఇయర్​ తాగునీటి డిమాండ్ల సమగ్ర వివరాలు సిద్ధంగా లేకపోవడంతో సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయానికి రాలేకపోయామని, ఈ అంశంపై సెప్టెంబర్​ 4న జలసౌధలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని మినిట్స్‌‌లో బోర్డు వెల్లడించింది.