హైదరాబాద్, వెలుగు: వన మహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలని, ఉపాధి పనులు, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో మంజూరైన 8,924 ఫార్మ్ పాండ్ల పనులను వేగవంతం చేయడంతో పాటు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటివరకు 5.32 కోట్లకుపైగా నాటినట్టు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాన్ని ఈ వర్షాల సమయంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడి 100 శాతం మనుగడ సాధించాలని చెప్పారు.
బెస్ట్ ఆఫీసర్లు, సిబ్బందికి అవార్డులు..
సెప్టెంబర్ నుంచి కొత్తగా చేయూత పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తునూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. విద్యార్థుల కోసం మహిళా సంఘాలు కుడుతున్న యూనిఫామ్‌లలో నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి గాంధీ జయంతి రోజున ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు.
