భూసేకరణకు 6 వేల కోట్లు..ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా స్పెషల్ ప్యాకేజీ: మంత్రి ఉత్తమ్

భూసేకరణకు 6 వేల కోట్లు..ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా స్పెషల్ ప్యాకేజీ: మంత్రి ఉత్తమ్
  •     నెల, నెలన్నర రోజుల్లో భూ సేకరణ, అటవీ అనుమతులు పూర్తి కావాలి
  •     మూడేండ్లలో 40 వేల ఎకరాలను సేకరించేలా లక్ష్యం
  •     కలెక్టర్లు రోజూ అధికారులతో రివ్యూ చేయాలి
  •     దేవాదులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆ పనులకు అవసరమయ్యే నిధులను వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారని, నిధుల కొరతతో ఏ ఒక్క ప్రాజెక్టు ఆగిపోవడానికి వీల్లేదని స్పష్టం చేశారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ క్లియరెన్సుల కోసం రూ. 6 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే మొదటి విడతగా రూ. 1,056 కోట్లు, తదుపరి రూ. 1,500 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియలను రాబోయే నెల నుంచి నెలన్నర రోజుల్లోగా కొలిక్కి తేవాలని నిర్దేశించారు. 

మంగళవారం జలసౌధలో జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దాంతోపాటు దేవాదుల ప్రాజెక్టుపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్క, ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ సమీక్ష చేశారు. వివిధ జిల్లాల్లో నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. రాబోయే మూడేండ్లలో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.6,150 కోట్లతో 40 వేల ఎకరాలను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడానికి జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ కొద్ది సమయం కేటాయించి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లు, ఇరిగేషన్ ఇంజినీర్లతో సమీక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూసేకరణ అవార్డులు పూర్తయిన వెంటనే మ్యూటేషన్లు చేయడం, ఎన్‌‌‌‌కంబరెన్స్‌‌‌‌లను తొలగించడం, సేకరించిన భూమిని లాంఛనంగా ఇరిగేషన్ శాఖకు అప్పగించడంలాంటి అనంతర ప్రక్రియలను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమన్వయం చేసుకొని తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. 

గౌరవెల్లి, బస్వాపూర్‌‌‌‌పై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌

గౌరవెల్లి ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా క్షేత్రస్థాయిలో ఆలస్యం జరుగుతుండడంపై మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి​ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు కలిసి కూర్చొని పెగ్ మార్కింగ్, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, సంబంధిత నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.  పరిమిత అదనపు పనులతో బస్వాపూర్ రిజర్వాయర్‌‌‌‌లో 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రతిపాదనను పరిశీలించి, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విజ్ఞప్తులపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు. ఏదైనా ప్రతిపాదనను లేదా అభ్యర్థనను ఆమోదించడం సాధ్యం కాకపోతే, అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా సంబంధిత ప్రజాప్రతినిధికి తెలియజేయాలని అన్నారు. వారం నుంచి పది రోజుల్లో సీఎం రేవంత్​తో కలిసి మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 

ఏడాదిలో దేవాదుల పూర్తి..

ఏండ్ల తరబడి పెండింగ్‌‌‌‌లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నామని మంత్రి ఉత్తమ్​ స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ఈ ప్రాజెక్టుకు ఉన్న అన్ని రకాల అడ్డంకులను అత్యంత ప్రాధాన్యతతో తొలగించాలని సూచించారని చెప్పారు. గోదావరి జలాలను ఎత్తిపోసి హనుమకొండ, వరంగల్, కరీంనగర్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించినా.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నేటికీ అసంపూర్తిగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

దేవాదుల ద్వారా గోదావరి నుంచి దాదాపు 38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి, సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశామని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. దేవాదుల భూసేకరణకు ఇటీవలే నిధులు ఇచ్చామని, మిగిలిన అవసరాలకు ప్రక్రియలు ముగియగానే నిధులు కేటాయిస్తామన్నారు. దేవాదుల నుంచి వీలైనంత ఎక్కువ జలాలను లిఫ్ట్​ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంపింగ్ స్టేషన్లు, మోటార్లను పూర్తి సామర్థ్యంతో నడిపించి, కమాండ్ ఏరియాలోని చెరువులు, రిజర్వాయర్లకు నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

దేవాదులను వేగంగా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

దేవాదుల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. రామప్పలో ప్రస్తుతం 29 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 35 అడుగుల వరకు నీటిని నిల్వ చేసే విధంగా అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. అందుకు ఎంత మేర భూమి అవసరమవుతుంది? ఎంత భూసేకరణ చేపట్టాల్సి వస్తుంది? అనే అంశంపై స్పష్టమైన లెక్కలు సిద్ధం చేయాలన్నారు. 

ఒక్కో అడుగు నీటి నిల్వ పెంచినప్పుడు ఎంత భూమి అవసరమవుతుందో విడివిడిగా లెక్కలు రూపొందించి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. రామప్ప–లక్నవరం లింక్ కెనాల్ పనులను రూ.33 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ లింక్ కెనాల్ పూర్తయితే ములుగు నియోజకవర్గంలోని 3 మండలాలకు సాగు, తాగునీటిని అందించొచ్చన్నారు. అదేవిధంగా జంపన్నవాగులో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ఈ లింక్ కెనాల్ కీలకంగా ఉపయోగపడుతుందని సీతక్క పేర్కొన్నారు.