- మరో 4 నియోజకవర్గాల్లో వచ్చే నెల 3 వరకు అప్లికేషన్లు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 16 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపికకు గురువారం (ఈ నెల 27) నుంచి లక్కీ డ్రా తీయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పురోగతి, లక్కీ డ్రా, లబ్ధిదారుల ఎంపిక, కొత్త నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూఆర్ పరిధిలో తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామన్నారు. ఈ ఇండ్లకు మొత్తం 60,720 దరఖాస్తులు అందాయని.. వాటి 360 డిగ్రీల క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. ఇందులో 19,820 మంది అనర్హులుగా తేలగా.. వారి అనర్హతకు గల కారణాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఈ నెల 28, 29, 31 తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహిస్తామని పొంగులేటి వెల్లడించారు. ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణాధికారిని కూడా నియమించామన్నారు. లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ. 10 వేల ఈఎండీ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తామని స్పష్టం చేశారు. 27న రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీ, మైలార్‌దేవరపల్లి, రెడ్ హిల్స్, 28న కౌకూర్, పాటిగడ్డ, జల్‌పల్లి, కుల్సుంపుర, 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్‌పల్లి, బండ్లగూడ(ఎల్‌ఐజీ కాలనీ, నందిముసలిగూడ, 30న గాజుల రామారం, అంబర్‌పేటలోని సిటీ పోలీస్‌లైన్స్, గడ్డి అన్నారం, ఆర్‌అండ్ క్వార్టర్స్, పోచారం(ఎల్ఐజీ కాలనీ)లో లక్కీడ్రా నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.
మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తింపు
క్యూర్ పరిధిలో కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలు గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇండ్ల చొప్పున మొత్తం 1,920 ఇండ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్ పరిధిలోని అమంగల్, గోషామహల్ నియోజకవర్గం నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గం జమిస్తాన్‌పూర్(ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడలో(ఫలక్‌నుమా సమీపంలో) ఇండ్లు నిర్మించేందుకు దరఖాస్తులను తీసుకుంటున్నామన్నారు. వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.
ఇందిరమ్మ టవర్స్ అప్లికేషన్ల పరిశీలన..
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హులుగా గుర్తించిన వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అప్లికెంట్లు ఒక్కో అప్లికేషన్ కు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ ఇలా పలు డాక్యుమెంట్లను ఆప్ లోడ్ చేశారు. ఒక డాక్యుమెంట్ రిజెక్ట్ అయినా మరో డాక్యుమెంట్ ను అధికారులు పరిశీలిస్తున్నారు.
అర్హులైన పబ్లిక్ కు హౌసింగ్ బోర్డు అధికారులు ఎస్ఎంఎస్ లు పంపుతున్నారు. లబ్దిదారులందరూ తమ దరఖాస్తు స్థితిని ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చని చెప్పారు. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినందున నిశితంగా పరిశీలిస్తూ , అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిస్ అవకుండా చూస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పరిష్కరించిన దరఖాస్తుదారుల వివరాలను వెంట వెంటనే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నామని, బుధవారం నాటికల్లా అన్ని అభ్యంతరాలను పరిష్కరిస్తామని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
