- అలోపతి డాక్టర్లతో సమానంగా స్టైపెండ్ పెంచాలని డిమాండ్
- ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాలో సమానంగా ఇస్తున్నారని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అలోపతి డాక్టర్లతో సమానంగా మేము కూడా ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తాం.. కానీ స్టైఫెండ్ ఇచ్చే దగ్గర మాత్రం మాపై ఇంత వివక్ష ఎందుకు?’’ అని రాష్ట్రంలోని ఆయుర్వేద డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గడిచిన 22 రోజులుగా ఆయుష్ జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు.
పదేళ్లుగా ఒక్కసారి కూడా స్టైఫెండ్ పెంచకపోవడం తమ శ్రమను అవమానించడమేనని వారు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 ప్రభుత్వ ఆయుష్ కాలేజీల్లో మొత్తం 340 మంది హౌస్ సర్జన్లు, 390 మంది పీజీ డాక్టర్లు ఈ వివక్షకు గురవుతున్నారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ డాక్టర్ బీఆర్‌కేఆర్ ఆయుర్వేద మెడికల్ కాలేజీ, రామంతపూర్ జేఎస్పీఎస్ హోమియోపతి కాలేజీ, చార్మినార్‌లోని నిజామియా టిబ్బీ యునానీ కాలేజీ, నేచర్ క్యూర్ హాస్పిటల్ తో పాటు వరంగల్ లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కాలేజీ విద్యార్థులు నిరసనలతో పాల్గొంటున్నారు.
అలోపతితో పోలిస్తే సగం కంటే తక్కువ
అలోపతి డాక్టర్లతో పోలిస్తే తమకు అందుతున్న స్టైఫెండ్ సగం కంటే తక్కువగా ఉండడంపై వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయుర్వేద హౌస్ సర్జన్లకు స్టైపెండ్ కేవలం రూ.13,000 మాత్రమే ఇస్తుండగా, వారు అలోపతితో సమానంగా రూ. 29,000 డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీజీ విద్యార్థులకు ప్రస్తుతం రూ. 31 వేల నుంచి రూ. 34 వేలు మాత్రమే అందుతుండగా, అలోపతి పీజీల మాదిరిగా రూ. 67 వేల నుంచి రూ. 74 వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు ఢిల్లీలో ఆయుర్వేద డాక్టర్లకు అలోపతితో సమానంగా స్టైఫెండ్ ఇస్తున్నారని, మన దగ్గరే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో హౌస్ సర్జన్లకు రూ. 26 వేలు, పీజీలకు రూ. 65 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు.
15 శాతం పెంపు ప్రతిపాదన తిరస్కరణ
తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆయుష్ జూడాలు చేస్తున్న ఆందోళనలు తీవ్రం కావడంతో ప్రభుత్వం ఇటీవల జరిపిన చర్చల్లో 15 శాతం పెంపును ప్రతిపాదించింది. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పెంపును విస్మరించి, కేవలం రూ. 13 వేలపై 15 శాతం అంటే దాదాపు రూ. 2,000 పెంచుతామనడం తమను హేళన చేయడమేనని జూనియర్ డాక్టర్ల జేఏసీ ఈ ఆఫర్ను తిరస్కరించింది. జీవో ఎంఎస్ నంబర్ 77 ప్రకారం అలోపతితో సమానంగా స్టైఫెండ్ పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే వరకు, పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆయుర్వేద డాక్టర్ల జేఏసీ స్పష్టం చేసింది. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా ఆయుష్ హాస్పిటల్స్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ గోడును ఆలకించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
