- ఇతర రాష్ట్రాల సర్టిఫికెట్లపైనే ఫోకస్
- మన వర్సిటీల రిపోర్టుల్లో ‘డివిజన్’ చూసి వదిలేస్తున్నరు
- మార్కుల వివరాలు చెక్ చేయట్లేదని ఆరోపణలు
హైదరాబాద్,వెలుగు: ఇంటర్ విద్యాశాఖ చేపట్టిన జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై విమర్శలు వస్తున్నాయి. జెన్యూనిటీ పేరుతో వెరిఫికేషన్ చేస్తున్నా.. అసలు మార్కుల లెక్క మాత్రం తేల్చడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా చెక్ చేస్తున్న అధికారులు.. మన రాష్ట్ర యూనివర్సిటీల సర్టిఫికెట్ల విషయంలో మాత్రం అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీల నుంచి వచ్చిన జెన్యూనిటీ రిపోర్టులో ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ ఉందా? లేదా? అన్నది చూసి సరిపెడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
మార్కులే కీలకం.. అయినా చెక్ చేయట్లే..
ఉమ్మడి రాష్ట్రంలో 2000 నుంచి 2007 వరకు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల నియామకాలు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో జరిగాయి. త్రిమెన్ కమిటీ మార్కులు, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. 2008 నుంచి రీజినల్ జాయింట్ డైరెక్టర్ల (ఆర్జేడీ) ద్వారా నియామకాలు చేపట్టారు. మొత్తం సుమారు 3,500 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ఉండగా.. ఇందులో దాదాపు 1,200 మంది వరకు ఆర్జేడీల ద్వారా నియమితులైనట్లు సమాచారం. ఈ నియామకాల్లో మార్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.
ఒకే కేటగిరీలో, ఒకే సబ్జెక్టులో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడితే.. ఒక్కటి రెండు మార్కుల తేడాతోనే ఉద్యోగం ఎవరికి రావాలన్నది తేలేది. దీంతో అప్పట్లో కొందరు సర్టిఫికెట్లలో ఎక్కువ మార్కులు చూపించి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగంలో చేరేటప్పుడు ఒక మార్కుల మెమో ఇచ్చి.. ఆ తర్వాత కొన్నేళ్లకు మరో మెమో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అప్పట్లో కొందరు ప్రిన్సిపల్స్ తమకు అనుకూలమైన అభ్యర్థులకు మార్కులు ఎక్కువగా చూపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్జేడీల ద్వారా జరిగిన నియామకాల్లో మార్కుల ఆధారంగానే కొలువులు ఇచ్చారు.
పక్క రాష్ట్రాల సర్టిఫికెట్లపైనేనా ఫోకస్..
ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లో పీజీ, ఇతర కోర్సులు చదివిన లెక్చరర్ల సర్టిఫికెట్లను వెరిఫై చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడ సర్టిఫికెట్లను లోతుగా పరిశీలించడంతో కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు కూడా బయటపడ్డాయి. అయితే.. ఇదే స్థాయిలో మన రాష్ట్రంలోని యూనివర్సిటీల సర్టిఫికెట్లను చెక్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ప్రిన్సిపల్స్ ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్ల నుంచి డీడీలు తీసుకుని.. యూనివర్సిటీలకు జెన్యూనిటీ కోసం పంపిస్తున్నారని చెబుతున్నారు. యూనివర్సిటీల నుంచి వస్తున్న రిపోర్టుల్లో ‘ఫస్ట్ డివిజన్’, ‘సెకండ్ డివిజన్’ అని మాత్రమే ధ్రువీకరిస్తున్నారు. అసలు అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలను మాత్రం అందులో పొందుపరచడం లేదు.
రికార్డులు ఉన్నా.. ఎందుకు చూడట్లే..
ఆర్జేడీ ఆఫీసుల్లో అప్పటి నియామకాలకు సంబంధించిన అభ్యర్థుల మార్కుల రికార్డులు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని ప్రస్తుత వెరిఫికేషన్‌తో పోల్చి చూస్తే అసలు విషయం బయటపడుతుందని అభ్యర్థులు అంటున్నారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? అప్పట్లో ఏ మార్కుల ఆధారంగా ఉద్యోగం వచ్చింది? ఇప్పుడు సమర్పిస్తున్న మార్కుల మెమోతో అవి సరిపోతున్నాయా? అనే వివరాలు చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కానీ.. ప్రస్తుత వెరిఫికేషన్‌లో సర్టిఫికెట్ జెన్యూన్‌గా ఉందా? పాస్ అయ్యారా? ఏ డివిజన్లో పాసయ్యారు? అన్నదే చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్కుల వివరాలను పట్టించుకోకపోతే వెరిఫికేషన్ ఉద్దేశమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
మార్కులతో కూడిన జెన్యూనిటీ కావాలి..
జూనియర్ లెక్చరర్ల నియామకాల్లో మార్కులే కీలకంగా ఉన్నందున.. ఇప్పుడు చేపడుతున్న వెరిఫికేషన్‌లో కూడా వాటినే ప్రధానంగా చెక్ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. కేవలం ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ అంటూ రిపోర్టులు తీసుకోవడం కాకుండా.. అభ్యర్థి సాధించిన అసలు మార్కులు, అప్పటి రికార్డులు, ప్రస్తుతం సమర్పించిన మార్కుల మెమోలతో సరిపోతున్నాయా లేదా అన్నది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టి.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నుంచి మార్కులతో కూడిన పూర్తి జెన్యూనిటీ రిపోర్టులు తెప్పించి వెరిఫై చేయాలని కోరుతున్నారు. అప్పుడే అర్హులు ఎవరు? తప్పుడు మార్కులతో ఉద్యోగాలు పొందినవారు ఎవరు? అన్నది స్పష్టంగా తేలుతుందని పేర్కొంటున్నారు.
