సారంపల్లికి కన్నీటి వీడ్కోలు..మల్లారెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన పలు పార్టీల నేతలు

సారంపల్లికి కన్నీటి వీడ్కోలు..మల్లారెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన పలు పార్టీల నేతలు
  •     ఎంబీ భవన్ నుంచి గాంధీ దాకా జనసంద్రమైన అంతిమయాత్ర
  •     గాంధీ మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అప్పగింత
  •     కడసారి చూసి కన్నీరుమున్నీరైన రైతులు, ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్/ పద్మారావునగర్, వెలుగు: రైతు ఉద్యమ నాయకుడు, సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డికి ప్రజాసంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు, రైతులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ వద్ద ఉంచిన సారంపల్లి భౌతికకాయాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం ఎంబీ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రి వరకు సాగిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు.  

ఎంబీ భవన్‌‌‌‌కు పోటెత్తిన జనం

మంగళవారం ఉదయం నిమ్స్ నుంచి మల్లారెడ్డి పార్థివదేహాన్ని ఎంబీ భవన్‌‌‌‌కు తీసుకురావడానికి ముందే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాబార్డు పరిసరాలు జనసంద్రంగా మారాయి. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు సారంపల్లి భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. వివిధ పార్టీల ప్రముఖులు తరలొచ్చి అంజలి ఘటించారు. 

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎంపీ వేం నరేందర్​ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకట్‌‌‌‌రెడ్డి, పల్లా వెంకట్‌‌‌‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నేతలు, వివిధ రాష్ట్రాల ఏఐకేఎస్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. మల్లారెడ్డి వ్యవసాయ రంగానికి, రైతు సమస్యలకు సజీవ ‘ఎన్‌‌‌‌సైక్లోపీడియా’ అని నేతలు కొనియాడారు. రైతాంగ ఉద్యమాలను ఏకతాటిపైకి తేవడంలో, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి విధానాల రూపకల్పనలో, జయతి ఘోష్ కమిటీ నివేదిక వెనుక మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. రైతు హక్కుల కోసం ఎగిసే ప్రతి గొంతులో మల్లారెడ్డి సజీవంగా ఉంటారని నేతలు నినదించారు.

గాంధీ మెడికల్​ కాలేజీకి భౌతికకాయం అప్పగింత

ఎంబీ భవన్ నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజానాట్యమండలి డప్పు చప్పుళ్లు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనల నడుమ గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమయాత్ర కొనసాగింది. అక్కడ కాలేజీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాగమోహన్ సమక్షంలో మల్లారెడ్డి భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం అప్పగించారు. వైద్య విద్యార్థుల కోసం మల్లారెడ్డి భౌతికకాయాన్ని దానం చేయడం అత్యంత గొప్ప విషయమని, సమాజానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని వైద్యులు కొనియాడుతూ కుటుంబ సభ్యులను అభినందించారు.