క్రికెటర్లకు బొద్దింకల ‘నాన్ వెజ్ టీ’ తాగిస్తున్నారా..?..ఎంసీఏపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం

క్రికెటర్లకు బొద్దింకల ‘నాన్ వెజ్ టీ’ తాగిస్తున్నారా..?..ఎంసీఏపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కార్యాలయ ప్రాంగణంలోని రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లకు ఇస్తున్న టీలో బొద్దింకలు, ఈగలు వస్తున్న విషయాన్ని వారు ముందే గమనించారా..? అని ఎంసీఏను ప్రశ్నించింది. ఎంసీఏ కార్యాలయ పరిధిలోని ఐదు రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించిందంటూ దాఖలైన పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ రెస్టారెంట్లలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌‌డీఏ) తనిఖీలు నిర్వహించగా.. కిచెన్లలో బొద్దింకలు, ఈగలు, మురికి నేలలు బయటపడ్డాయి. దీంతో ఎఫ్‌‌డీఏ ఆ ఐదు రెస్టారెంట్ల లైసెన్సులను సస్పెండ్ చేసింది. ఈ చర్యలను సవాల్ చేస్తూ ఎంసీఏ కోర్టును ఆశ్రయించింది. 

కాగా, ఈ లైసెన్సులు ఎంసీఏ పేరిట ఉండగా, వాటిని 'షిర్కే ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్' అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. లైసెన్సులు సస్పెండ్ చేసే ముందు ఎఫ్‌‌డీఏ తమకు నోటీసు ఇచ్చి ఉండాల్సిందని ఎంసీఏ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, తనిఖీల్లో తీవ్ర నిర్లక్ష్యం బయటపడినప్పుడు తక్షణమే లైసెన్సులు సస్పెండ్ చేసే అధికారం ఎఫ్‌‌డీఏకి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. రెస్టారెంట్లు మూతపడటంతో క్రికెటర్లకు కనీసం టీ కూడా దొరకడం లేదని ఎంసీఏ తెలపగా.. వంటగదిలో ఈగలు, బొద్దింకలు ఉంటే అది 'నాన్-వెజ్ టీ' అవుతుందని ధర్మాసనం ఎద్దేవా చేసింది. తాము తాగుతున్న టీ ఎలాంటిదో ఆటగాళ్లకు తెలుసా? అని ప్రశ్నించింది.

ఎఫ్‌‌డీఏ చర్యలు అభినందనీయం: హైకోర్టు

ఆహార భద్రత విషయంలో ఎఫ్‌‌డీఏ తీసుకున్న చర్యలను హైకోర్టు అభినందించింది. అయితే, ఆటగాళ్ల సౌకర్యార్థం తాత్కాలికంగా టీ, కాఫీ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. రెస్టారెంట్లు లోపాలను సరిదిద్దుకుంటే సస్పెన్షన్‌‌ను పొడిగించరాదని సూచించింది. ఎంసీఏ, ప్రైవేట్ కంపెనీ మధ్య ఒప్పందంపై పరిశీలన జరపాలని ఎఫ్‌‌డీఏను కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 29కి వాయిదా పడింది.