- పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ మార్చ్
- యువతపై వాటర్ కెనాన్ల ప్రయోగం, లాఠీచార్జ్ ..
- రాళ్లు రువ్విన నిరసనకారులు
- విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్‌జేడీ మద్దతు
బిహార్ రాజధాని పాట్నాలో నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతోపాటు పలు డిమాండ్లపై తొమ్మిది రోజులుగా నిరసన చేస్తున్న యువత..‘సీఎం ఆవాస్ ఘెరావ్’ మార్చ్ లో భాగంగా మంగళవారం సీఎం సామ్రాట్ చౌదరి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతోపాటు పలు డిమాండ్లపై తొమ్మిది రోజులుగా నిరసన చేస్తున్న యువత..‘సీఎం ఆవాస్ ఘెరావ్’ మార్చ్ లో భాగంగా మంగళవారం సీఎం సామ్రాట్ చౌదరి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
గాంధీ మైదాన్ నుంచి బయలుదేరిన వేలాదిమంది స్టూడెంట్లను పోలీసులు డాక్ బంగ్లా చౌరస్తా వద్ద బారికేడ్లను ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. కానీ, ఆందోళనకారులు బారికేడ్లను తొలగించుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. కొందరు విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం ఇంటివైపు పరుగులు తీశారు.
పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులపైకి పోలీసులు వాటర్ కెనన్‌లు ప్రయోగించడంతోపాటు లాఠీచార్జ్ కూడా చేశారు. అయితే, పోలీసుల చర్యకు కౌంటర్ గా విద్యార్థులు వాటర్ కెనన్‌ల కింద 'రెయిన్ డ్యాన్స్' చేశారు. అనంతరం పోలీసులు, స్టూడెంట్ల మధ్య తోపులాట జరగడంతో డాక్ బంగ్లా చౌరస్తా వద్ద ఉద్రిక్తత తారస్థాయికి చేరింది.
ఆగ్రహించిన కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దాంతో పలువురు పోలీసులకు, విద్యార్థులకు గాయాలయ్యాయి. ఓ యువ పోలీసు అధికారి నిరసనకారుడిని చెంపదెబ్బ కొట్టడం, తోపులాటలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు
స్టూడెంట్ల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌తో పాటు ఆర్‌జేడీ నాయకులు విద్యార్థుల డిమాండ్లకు సంఘీభావం తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి పరీక్షల కంట్రోలర్ రాకేష్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. దీనిపై తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. అధికారుల భాష సీఎం సామ్రాట్ చౌదరి వైఖరిని పోలి ఉందని విమర్శించారు. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని వామపక్ష నేతలు ఖండించారు.
నెలకో స్టూడెంట్ సపోర్ట్ క్యాంప్: సీఎం
విద్యార్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో బీహార్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్టూడెంట్ల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ‘విద్యార్థి సహయోగ శిబిర్ (స్టూడెంట్ సపోర్ట్ క్యాంప్)’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ శిబిరాన్ని సీఎం సమ్రాట్ చౌధరి మంగళవారం వైశాలి జిల్లాలోని బిదుపూర్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
ప్రతినెలా నాల్గవ మంగళవారం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తామని సీఎం సామ్రాట్ చౌదరి ప్రకటించారు. విద్యార్థులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ పోర్టల్ లేదా ‘1100’ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా నమోదు చేసుకుని, వాటి స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే సౌకర్యాన్ని కల్పించామన్నారు. గరిష్టంగా 30 రోజుల్లోగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
