- రాజస్తాన్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు
- జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల సమస్యలపై సుమోటోగా విచారణ
- గ్రామీణ పాఠశాలల్లో కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచన
- పేపర్ లీక్‌లు, స్కూళ్లలో మౌలిక వసతుల కొరతపై ఆగ్రహం
జైపూర్: జెన్ జీ (1997 – 2012), జెన్ ఆల్ఫా (2013 – 2024), జెన్ బీటా (2025 – 2039) తరాలకు చెందిన విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాజస్తాన్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ క్యాంటీన్లలో, స్కూల్ గేట్లకు 50 మీటర్ల పరిధిలో కొలెస్ట్రాల్, చక్కెర, ఉప్పు కలిగిన కూల్ డ్రింక్స్, చిప్స్, ట్రాన్స్–ఫ్యాట్ ఉన్న బేకరీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్ విక్రయాలను పూర్తిగా నిషేధించింది.
ప్రతి పాఠశాలలో నాలుగు వారాల్లోగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో 'స్కూల్ ఫుడ్ సేఫ్టీ అండ్ న్యూట్రిషన్ కమిటీ'ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా క్యాంటీన్లలో కేలరీలు, పోషకాహార విలువలతో కూడిన మెను బోర్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అలాగే, ఏది ఆరోగ్యకరమైనదో పిల్లలు క్షణంలో గుర్తించడానికి ట్రాఫిక్–లైట్ లేబులింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పింది.
మధ్యాహ్న భోజనం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని..రూల్స్ ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది. జెన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల యువత ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ సోమవారం సుమోటోగా విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా యువతలో జంక్ ఫుడ్, మొబైల్ స్క్రీన్ టైమ్ పెరుగుదలతోపాటు గ్రామీణ పాఠశాలల్లో వసతుల కొరత, ఏఐ వల్ల కనుమరుగవుతున్న ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలు, పదే పదే జరుగుతున్న పేపర్ లీక్‌లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్య, ఆరోగ్యం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖలతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.
కీలక మార్గదర్శకాలివే..
విద్యార్థులలో పెరుగుతున్న మొబైల్ స్క్రీన్ టైమ్, ఎక్కువగా సాంకేతికతపై ఆధారపడటం పట్ల కూడా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ విద్య ముఖ్యమే అయినప్పటికీ..హ్యాండ్ రైటింగ్, పుస్తక పఠనం, స్వతంత్ర ఆలోచన వంటి ప్రాథమిక నైపుణ్యాలను సాంకేతికత భర్తీ చేయకూడదని హెచ్చరించింది. అలాగే, పదే పదే జరుగుతున్న పేపర్ లీక్‌లు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని, అకడమిక్ షెడ్యూల్‌ను దెబ్బతీస్తున్నాయని, పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని పేర్కొంది.
లీక్‌లను అరికట్టడానికి పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. గ్రామీణ, మారుమూల ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, స్మార్ట్ తరగతి గదులు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆరోగ్య తనిఖీలు, మరుగుదొడ్లు, తాగునీరు, క్రీడా సౌకర్యాల కొరతను తీర్చాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు గ్రామీణ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎనిమిది వారాల్లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
జెన్ జెడ్ తరాలు ఎదుర్కొంటున్న విద్య-ఉపాధి అంతరం, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, తక్కువ ధరల్లో హాస్టళ్లు, గృహ వసతి, డిజిటల్ డిటాక్స్ కార్యక్రమాలు, డేటా ప్రైవసీ, సైబర్ భద్రత వంటి సవాళ్లను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికను సిద్ధం చేయాలని కోర్టు పేర్కొంది.
