- మీ పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా సహకరిస్తం
- జపాన్‌తో స్కిల్డ్ మ్యాన్ పవర్ మొబిలిటీపై మరింత బలమైన భాగస్వామ్యం
- తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టి
- ఒసాకాలో ఇండియా- జపాన్ వర్క్‌ఫోర్స్ రౌండ్‌టేబుల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జపాన్ కంపెనీల పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.
ఒసాకాలో కేరీర్ కన్సల్టెజ్వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ రావు నిర్వహించిన ‘లేవరేజింగ్ ఇండియన్ టాలెంట్’ ఇండియా–జపాన్ వర్క్‌ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి వివేక్ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. జపాన్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు, నైపుణ్య మానవ వనరులు, ఉపాధి అవకాశాలు, టాలెంట్ మొబిలిటీపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలతో పాటు నైపుణ్యవంతులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో రాష్ట్రానికి బలమైన టాలెంట్ పూల్ ఉందన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కోరారు.
పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం అందిస్తూ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాల్లో వర్క్‌ఫోర్స్ మొబిలిటీ కీలక అంశంగా మారుతోందని చెప్పారు.
600 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్
రాష్ట్రంలో సుమారు 600 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి చూపుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇది తెలంగాణపై జపాన్ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. జపాన్‌లో పెరుగుతున్న నైపుణ్య మానవ వనరుల అవసరాలను తెలంగాణ టాలెంట్‌తో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
కష్టపడి పనిచేయడం, కొత్త విషయాలను వేగంగా నేర్చుకోవడం, పనిచేసే సంస్థలు, దేశాల సంస్కృతికి అనుగుణంగా మారడం తెలంగాణ యువత ప్రత్యేకతలని తెలిపారు. టామ్‌కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు భాషా శిక్షణ, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, పని సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జర్మనీతో స్కిల్డ్హ్యూమన్రిసోర్స్ రంగంలో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని మంత్రి తెలిపారు.
ఇటీవల జర్మనీ బృందం తెలంగాణలో పర్యటించినప్పుడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. జర్మనీలో నైపుణ్య మానవ వనరులకు డిమాండ్.. వారి నియామకం, శిక్షణ, ఉపాధి కల్పనలో జపాన్ సంస్థలతో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: హరిచందన
టామ్‌కామ్‌తో రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని శక్తి శాఖ కార్యదర్శి హరిచందన తెలిపారు. అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్ మొబిలిటీలో టామ్‌కామ్‌ను విశ్వసనీయ ప్రభుత్వ భాగస్వామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. డిసెంబర్ లో నిర్వహించనున్న రైజింగ్ తెలంగాణ సదస్సులో జపాన్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని ఆహ్వానించారు.
ఐదేండ్లలో 5 లక్షల మంది అవసరం: చంద్రు అప్పర్
ఒసాకా–కోబేలో భారత కాన్సుల్ జనరల్ చంద్రు అప్పర్ మాట్లాడుతూ.. భారత్–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో వర్క్‌ఫోర్స్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. భారత ప్రధానమంత్రి మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రస్తావించారు. ఐదేండ్లలో భారత్–జపాన్‌కు 5 లక్షల మంది మానవవనరులు అవసరమని, అందులో 50 వేల మంది నైపుణ్యవంతులైన సిబ్బంది, ప్రతిభావంతులైన మానవ వనరులు జపాన్‌కు అవసరమవుతారని తెలిపారు.
భారత్‌లో వైవిధ్యభరితమైన టాలెంట్ ఉంది: రోహిత్ రావు
కెరీర్ కన్సల్టెజ్ వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ రావు మాట్లాడుతూ.. భారత్‌లో విస్తృతమైన, వైవిధ్యభరితమైన టాలెంట్ ఉందన్నారు. ఐటీ, ఇంజినీరింగ్ రంగాల్లో భారత ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ, స్కిల్డ్, టెక్నికల్ మ్యాన్‌పవర్‌లోనూ భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జపాన్‌లో ఉపాధి అవకాశాల కోసం భారతీయ యువతకు జపనీస్ భాష, సంస్కృతి, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
