- వీరిలో కాంపౌండర్లు, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్..
- ఇంటర్, డిగ్రీ చదివినవారు కొందరు..
- కూతురి ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో ఒకరు..
- క్లినిక్‌లు నిర్వహిస్తూ కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లతో వైద్యం
- జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో 12 మందిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: అర్హత లేకపోయినా డాక్టర్లమంటూ దర్జాగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ప్రైవేటు క్లినిక్‌ల బోర్డులు తగిలించుకొని, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫేక్డాక్టర్ల ఆటకట్టించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్జోన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి 12 మంది నకిలీ డాక్టర్లను అరెస్ట్‌చేశారు.
వారి వద్ద నుంచి భారీగా నిషేధిత, గడువు ముగిసిన మందులు, సెలైన్ బాటిళ్లు, సర్జికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. పేషెంట్లకు సెలైన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, కుట్లు వేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
ఈ ప్రాంతాల్లోనే పట్టుబడ్డారు..
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. డి.రామశేఖర్ రెడ్డి అనే వ్యక్తి 2015 నుంచి తన భార్య నాగజ్యోతి పేరిట ఉన్న డీ-ఫార్మసీ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని ఆక్వా ఫార్మసీని నడుపుతూ వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. అతనితోపాటు అనస్థీషియా టెక్నీషియన్ డిప్లొమా చేసిన రాగం సుధాకర్ డాక్టర్‌గా చెలామణి అవుతున్నట్లు తేల్చారు. గడువు ముగిసిన ట్రమడాల్ ఇంజెక్షన్లు, 30 పెద్ద సెలైన్ బాటిళ్లు, సర్జికల్ ఐటెమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- రహమత్ నగర్‌లో నర్స్‌గా పనిచేసిన అనుభవంతో మిరుదొడ్డి భారతి.. ఎలాంటి అనుమతి లేకుండా క్లినిక్ ప్రారంభించింది. చిన్నారులతో కలిపి రోజుకు 10 నుంచి 15 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. ఆమె వద్ద నుంచి పారాసిటమాల్ పీడియాట్రిక్ సిరప్‌లు, యాంటీబయాటిక్స్, ప్రెగ్నెన్సీ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో డిగ్రీ(బీఏ) పూర్తి చేసిన కాటిక మహేశ్‌రావు ఓ గదిని అద్దెకు తీసుకుని పేరు లేని క్లినిక్ ప్రారంభించాడు. రోజుకు 40 నుంచి 50 మందికి చికిత్స చేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేశారు.
ఫిల్మ్‌నగర్ పరిధిలో శ్రీ సాయి తిరుమల క్లినిక్ నడుపుతున్న పానుగంటి బాల నరసింహను పోలీసులు పట్టుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీ ఎంట్రన్స్‌కు సిద్ధమవుతున్న తన కుమార్తె పేరును అడ్డుపెట్టుకుని ఫార్మసీ పక్కనే క్లినిక్ తెరిచి, వైద్యం చేస్తున్నట్లు తేల్చారు.
బోరబండ గంగానగర్ కూరగాయల మార్కెట్ వద్ద ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసిన మహమ్మద్ అబ్దుల్ వలీ.. ల్యాబ్ టెక్నీషియన్ గా చేసిన అనుభవంతో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. జెంటామైసిన్, పారాసిటమాల్, డెక్సామిథసోన్, ఆండాన్‌సెట్రాన్ వంటి ఇంజెక్షన్లను పోలీసులు సీజ్ చేసి, నిందితుడిని అరెస్ట్‌చేశారు.
సికింద్రాబాద్ చిలకలగూడలోని ఫ్యామిలీ క్లినిక్‌పై దాడి చేసిన పోలీసులు ఏలూరు జిల్లాకు చెందిన నీలగిరి ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కాంపౌండర్‌గా చేసిన ఇతను, నకిలీ ఎంబీబీఎస్, బీహెచ్‌ఎంఎస్ సర్టిఫికెట్లను సృష్టించి, జనరల్ అండ్ చైల్డ్ స్పెషలిస్ట్‌గా చెలామణి అవుతూ గడువు ముగిసిన మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు.
రాణిగంజ్‌లోని నల్లగుట్ట ప్రాంతంలో సంధాని క్లినిక్ నడుపుతున్న ఇంటర్‌తో చదువు ఆపేసిన అదన్ సంధాని అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. చర్మవ్యాధుల నిపుణుడిగా నటిస్తూ, ఇంట్లోనే కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ మిశ్రమంతో తయారు చేసిన పెట్రోలియం జెల్‌ను సోరియాసిస్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్నట్లు నిర్ధారించారు.
దోమల్‌గూడ పరిధిలోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద సాయి రామ్ క్లినిక్ నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాస్(బీఎస్సీ)ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతను ఏకంగా 26 ఏండ్లుగా వైద్యం అందిస్తున్నట్లు తేల్చారు.
చిలకలగూడ వెస్లీ చర్చి సమీపంలో పదోతరగతి చదివి సాయి రామ్ క్లినిక్ నడుపుతున్న కాంపౌండర్ పెద్దపాట్ల సదానంద్‌ను అధికారులు పట్టుకున్నారు.
ఓయూ సిటీ పరిధిలోని మణికేశ్వర్‌నగర్‌లో సరోజిని పాలి క్లినిక్ పేరుతో ఫ్యామిలీ ఫిజీషియన్‌గా చెలామణి అవుతున్న డిగ్రీ విద్యార్థి చింతలూరి రమేశ్‌తోపాటు 15 ఏండ్లుగా సూర్య క్లినిక్ నడుపుతూ వైద్యం అందిస్తున్న శివరాత్రి లింగయ్య అనే మాజీ కాంపౌండర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
- నకిలీ పట్టాలు, ఇంజెక్షన్లు సీజ్
నిందితుల వద్ద నుంచి నకిలీ ఎంబీబీఎస్ పట్టాలతోపాటు స్టెతస్కోప్‌లు, బీపీ మెషీన్లు, ఇంజెక్షన్లు, మాత్రలు, సెలైన్ బాటిళ్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. వాటితోపాటు నకిలీ డాక్టర్లను ఠాణాల్లో అప్పగించారు. ఇలాంటి వ్యక్తులెవరైనా క్లినిక్‌లు నడుపుతున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడే నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐలు యాదేందర్, రాజశేఖర్ పాల్గొన్నారు.
