అయ్యోపాపం.. శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు

అయ్యోపాపం.. శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న  పోలీసులు
  • మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆలయ సమీపంలోని వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.  ఇద్దరు రూమ్ లో ప్యాన్ కు ఉరి వేసుకోగా, మరో ముగ్గురు బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నారు.

 గత 3 రోజులుగా రూమ్‌‌‌‌ నుంచి బయటకు రాకపోవడంతోపాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తెరచి చూడగా బాత్రూమ్‌‌‌‌లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌‌‌‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని కనిపించారు.

 మృతులు సుధాకర్(36), గోగుల ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15)గా పోలీసులు  గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

సంఘటనాస్థలాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్​నాయుడు,  ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు. సుధాకర్ కుటుంబ సభ్యులు.. గత నెల 28న శ్రీశైలం వడ్డెర సత్రం రూమ్ నెంబర్ 11లో రూ. 800 చెల్లించి అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.  

రెండు రోజుల తర్వాత ఖాళీ చేయాలని వడ్డెర సత్రం నిర్వాహకులు చెప్పినప్పటికీ.. అనారోగ్యంతో వచ్చామని, మరికొద్ది రోజులు ఉండి పూజలు చేయించుకుంటామని సుధాకర్ చెప్పినట్లు సమాచారం. రోజుకు  రూ.800  చెల్లిస్తూ వడ్డెర సత్రంలోనే సుధాకర్ కుటుంబ సభ్యులు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఐదుగురి మృతదేహాలను కిందకు దించిన శ్రీశైలం పోలీసులు.. పోస్టుమార్టం కోసం సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, రూల్స్ కు  విరుద్ధంగా వడ్డెర సత్రం యాజమాన్యం.. యాత్రికులకు నెల రోజులపాటు రూమును ఎందుకు అద్దెకు ఇచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వ్యక్తులు శ్రీశైలంలో నెల  రోజులపాటు ఎందుకు ఉన్నారనే కోణంలోనూ విచారణ చేపట్టారు.