అక్రెడిటేషన్ల గడువు పెంపు...పాత కార్డులు సెప్టెంబర్‌‌ 15 వరకు చెల్లుబాటు

అక్రెడిటేషన్ల గడువు పెంపు...పాత కార్డులు సెప్టెంబర్‌‌ 15 వరకు చెల్లుబాటు
  •     హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌‌, వెలుగు: అక్రెడిటేషన్ కార్డులు కలిగి ఉన్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పాత కార్డుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్తగా అక్రెడిటేషన్‌‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లేదా గతంలో కార్డులు లేని వారికి అనుకూలంగా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అక్రెడిటేషన్‌‌ అర్హతలకు సంబంధించి ప్రభుత్వం గతేడాది జారీ చేసిన జీవోను సవాల్‌‌ చేస్తూ హైటెక్‌‌ ప్రింట్‌‌ అండ్‌‌ ఎలక్ట్రానిక్‌‌ మీడియా అసోసియేషన్‌‌, తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌‌ జర్నలిస్ట్‌‌ ఫెడరేషన్‌‌, క్రియేటివ్‌‌ ఇండియా బ్రాడ్‌‌కాస్టింగ్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 

కేబుల్‌‌, శాటిలైట్‌‌ చానళ్ల మధ్య వర్గీకరణపై పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున స్పెషల్‌‌ జీపీ రాహుల్‌‌రెడ్డి వాదిస్తూ.. ఉర్దూ వర్కింగ్‌‌ జర్నలిస్ట్‌‌ ఫెడరేషన్‌‌ సమర్పించిన 535 మంది సభ్యుల జాబితాలో 268 మందికే గతంలో అక్రెడిటేషన్‌‌ కార్డులు ఉన్నట్టు పరిశీలనలో తేలిందన్నారు. వారిలో కొందరికి ఇప్పటికే  కార్డులు జారీ చేశామని తెలిపారు. దాదాపు 20 వేల మంది మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్‌‌ కార్డులు జారీ చేసినట్టు ప్రభుత్వ వాదనను ధర్మాసనం ప్రస్తావించింది. మూడు వాయిదాలు పూర్తయిన తర్వాత సమస్యను ప్రస్తావించడం సరికాదని పిటిషనర్‌‌ తరఫు న్యాయవాదిని తప్పుబట్టింది. తుది వాదనలు వింటామని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబర్‌‌ 15కు వాయిదా వేసింది.