- శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శాసనసభ కమిటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా ఆ పథకాలు మరింత విజయవంతంగా ప్రజలకు అందుతాయన్నారు.
మంగళవారం శాసనమండలిలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్టీ, బీసీ, మహిళా కమిటీల సమావేశం జరిగింది. ఈ కమిటీల మీటింగ్ కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. ఎస్టీ, బీసీ, మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీల చైర్మన్ లు, సభ్యులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రణాళికబద్ధంగా అమలు కోసం ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలతో కూడిన నివేదిక ఇవ్వాలని కోరారు. కమిటీల్లో సభ్యులుగా పనిచేయడం వల్ల రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, మంచి ప్రజాప్రతినిధులుగా మరింత పేరు సంపాదించే అవకాశం ఉందన్నారు.
