హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు లేదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రేగా కాంతారావుకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందని, అలాంటిది కన్నతల్లి లాంటి పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేయడం కన్నతల్లి రొమ్ము గుద్దడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కాంతారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
సీఎంపై మాట్లాడే నైతిక అర్హత రేగాకు లేదని పేర్కొన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలే రేగా కాంతారావును తరిమికొడతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఓడించడంతో ఇంట్లో కూర్చున్న కాంతారావుకు సీఎంను విమర్శించే ధైర్యం ఎక్కడిదని ప్రశ్నించారు. మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపైనా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులపైనా విమర్శలు చేస్తే క్షమించేది లేదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే పాయం హెచ్చరించారు.
