- అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ పేరిట మోసం, నిందితుడి అరెస్ట్
- వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత
వరంగల్, వెలుగు: తమకు ఒక ప్రముఖ ఐటీ కంపెనీ ఉందని, ప్రతిరోజు వందలాది మంది ఉద్యోగులకు భోజనం సప్లై చేయాలంటూ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ముసుగులో హాస్టల్ ఓనర్లను మోసం చేస్తున్న చీటర్‍ను మంగళవారం వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. సీపీ శ్వేత మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్‍పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షబ్బీర్ అలియాస్ కిరణ్ కుమార్, శ్రీకాంత్‍రెడ్డి, నర్సింహారెడ్డి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ హైదరాబాద్‍లోని కుత్బుల్లాపూర్‍లో నివాసం ఉంటున్నాడు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో హాస్టళ్లకు వెళ్లి ఓనర్ల నంబర్లను సేకరించాడు.
తనకు తానుగా ప్రముఖ ఐటీ కంపెనీ క్యాటరింగ్ కాంట్రాక్టర్‌గా పరిచయం చేసుకొని, ఉద్యోగులకు భోజనం అందించే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఫీజులు, క్యాటరింగ్ సామగ్రి కొనుగోలు పేరుతో యూపీఐ, ఇతరుల పేర్లతో ఉన్న బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. ఇలా ఫోన్ నంబర్ మార్చి మోసాలకు పాల్పడ్డాడు.
వరంగల్‍లో 10 కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో మరో 7 కేసులు, 6 సైబర్ ఫిర్యాదులతో కలిపి 23 కేసులు నమోదయ్యాయి. హనుమకొండ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిపై స్పెషల్ ఫోకస్ పెట్టి, టెక్నాలజీ ఆధారంగా నిందితుడి జాడ తెలుసుకున్నారు. షబ్బీర్ అలీ ఇప్పటికే రూ.36.99 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. ఇందులో రూ.13.09 లక్షలను పోలీసులు హోల్డ్ చేశారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు. డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు పాల్గొన్నారు.
