- యూరియా నిల్వలు 2.77 లక్షల టన్నులు
- రైతులు ముందస్తు బుకింగ్స్, కొనుగోళ్లకు తొందరపడొద్దు: అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. సబ్సిడీ ఎరువుల విక్రయాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు జరుగుతున్నాయని.. మిగతా 10 జిల్లాల్లో ఈ నెలాఖరులోగా అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటివరకు యాప్ ద్వారా 10.17 లక్షల క్యూఆర్ కోడ్‌లు జనరేట్ కాగా.. 42.34 లక్షల ఎరువుల బస్తాలు బుక్ అయ్యాయని చెప్పారు. ఇందులో 28.39 లక్షల బస్తాలను విక్రయించినట్లు తెలిపారు. యాప్ అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాంకేతిక బృందాలతో సమన్వయం చేస్తోందన్నారు.
2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ..
వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 6.75 లక్షల టన్నుల యూరియాను విక్రయించినట్లు గోపి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. గత ఏడాది ఇదే సమయానికి 0.32 లక్షల టన్నుల నిల్వ మాత్రమే ఉండగా.. ఈసారి నిల్వలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం 0.33 లక్షల టన్నుల డీఏపీ, 2.27 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.31 లక్షల టన్నుల ఎంఓపీ, 0.20 లక్షల టన్నుల ఎస్‌ఎస్‌పీ అందుబాటులో ఉన్నాయని వివరించారు.
