నాలుగు గోడల మధ్య కులవివక్ష చూపినా శిక్షించాలి: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్

నాలుగు గోడల మధ్య  కులవివక్ష చూపినా శిక్షించాలి: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్
  •     అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(ఎస్) సవరించాలని కేంద్రానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విజ్ఞప్తి
  •     ఏడేండ్లలోపు శిక్షల కేసుల్లో స్టేషన్ బెయిళ్లు ఇవ్వడం సరికాదు: చైర్మన్​ బక్కి వెంకటయ్య

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం-1989ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కీలక సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ ఎస్సీ కమిషన్‌‌‌‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కోరింది. ఇందులో భాగంగా చట్టంలోని సెక్షన్ 3(ఎస్)ను సవరించాలని విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా.. నాలుగు గోడల మధ్య, వ్యక్తిగత ప్రాంతాల్లో కులం పేరుతో దూషించినా శిక్ష పడేలా చట్టాన్ని మార్చాలని కోరింది. 

మంగళవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌‌‌‌తో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యను కలిసి వినతిపత్రాలు ఇచ్చింది. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్‌‌‌‌లో బక్కి వెంకటయ్య మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సెక్షన్ 3(ఎస్) ప్రకారం పబ్లిక్ వ్యూలో దూషిస్తేనే నేరంగా పరిగణిస్తున్నారని వెంకటయ్య చెప్పారు. దీంతో నిందితులు సులువుగా తప్పించుకుంటున్నారని అన్నారు. ‘‘పబ్లిక్ వ్యూలో దూషించడం’’ అనే పదాలకు బదులు ‘‘ఏ పరిస్థితుల్లోనైనా కులం పేరుతో దూషించడం’’ అని మార్చాలని కోరినట్లు తెలిపారు.

స్టేషన్ బెయిళ్లపై అభ్యంతరం..

ఏడేండ్లలోపు శిక్ష పడే కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సాకుగా చూపి పోలీసులు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని వెంకటయ్య ఆరోపించారు. దీంతో అట్రాసిటీ చట్టం ఉద్దేశం దెబ్బతింటోందన్నారు. డిజిటల్ ఆధారాలైన ఆడియో, వీడియోలను సేకరిస్తున్నందున.. వాటిని కోర్టుల్లో చెల్లుబాటు అయ్యేలా చట్టంలోని సెక్షన్ 15ఏ ద్వారా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65 కింద నిబంధనలు రూపొందించాలని కోరినట్లు చెప్పారు.

బాధితులకు ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలి..

అట్రాసిటీ బాధితులకు చట్ట ప్రకారం పరిహారంతో పాటు ఉద్యోగం, ఉచిత ఇల్లు ఇవ్వాలని కేంద్రాన్ని, జాతీయ కమిషన్లను కోరినట్లు వెంకటయ్య తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటివరకు 1,550 మంది బాధితులకు ఇండ్లు ఇచ్చామని చెప్పారు. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేలా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.