- కేంద్ర కేటాయింపులు రూ.3,825.31 కోట్లు
- మిగిలిన రూ.2,486.47 కోట్లు రాష్ట్రం వాటా
- కూలీల వేతనాలకే సింహభాగం.. రూ.3,481.04 కోట్లు
- మెటీరియల్ కాంపోనెంట్‌కు రూ.2,320.69 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో పొంచి ఉన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం తలెత్తకుండా నివారించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాచరణను రెడీ చేసింది. నూతన ‘వీబీ–జీ రామ్ జీ’ చట్టం–2025 అమలులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,311.78 కోట్ల బడ్జెట్‌కు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వాటా రూ.3,825.31 కోట్లు కాగా, మిగిలిన నిధులు రూ.2,486.47 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కేటాయించనున్నది. ఈ నిధులతో గ్రామీణ పేదలకు 125 రోజుల పని గ్యారెంటీ కల్పించడంతోపాటు భవిష్యత్ కరువులను తట్టుకునేలా శాశ్వత జల, జీవనోపాధి ఆస్తుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేందుకు బడ్జెట్‌లో వేతనాలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు.
కూలీల వేతనాలకే 55 శాతానికిపైగా నిధులు
ఎల్‌నినో కారణంగా వ్యవసాయ పనులు తగ్గిపోయి కూలీలు ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉండేందుకు బడ్జెట్‌లో 55 శాతానికిపైగా నిధులను నేరుగా కూలీల వేతనాలకే రూ.3,481.04 కోట్లు కేటాయించారు. అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి చట్టబద్ధంగా ఏడాదికి 125 రోజుల ఉపాధి పనిని గ్యారెంటీగా కల్పిస్తారు. జులై నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కోట్ల పనిదినాలు కల్పించాలని సర్కారు టార్గెట్‌గా పెట్టుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజూ కనీసం 60 మందికి తగ్గకుండా కూలీలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఒక్కో జీపీలో నెలకు కనీసం1,050 పని దినాలు కల్పించాలి. మొత్తం పథకం కాలంలో ఒక్కో జీపీకి 9,500 పని దినాలు తప్పనిసరిగా నమోదు కావాలని ఆదేశించారు. కూలీలు ఉన్న చోటే పని కల్పించేలా ప్రతి ఆవాసంలోనూ 200 శాతం లేబర్ ఓరియెంటెడ్ పనుల ప్రణాళికలు సిద్ధం చేశారు.
మౌలిక వసతులు, ఫామ్ పాండ్లకు రూ.2,320 కోట్లు..
కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా పల్లెల్లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల కల్పన కోసం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.2,320.69 కోట్లు వెచ్చించనున్నారు. ప్రభుత్వం అనుమతించిన మొత్తం 318 రకాల పనుల్లో 107 పనులు నేరుగా నీటి సంరక్షణకే కేటాయించారు. ఇందులో ప్రతి చేనులో ‘ఎకో ఫామ్ పాండ్’ నిర్మాణం, చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, బోర్ల రీచార్జ్ పనులకు ప్రాధాన్యమిస్తున్నారు.
గ్రామీణ మహిళలు, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం 86 రకాల పనులను చేపట్టనున్నారు. ఇందులో మహిళా సంఘాల వర్క్‌షెడ్లు, షీ-మార్ట్స్, రూరల్ మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీలు, పశువుల పాకలు, గోదాముల నిర్మాణాలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నారు. సిబ్బంది నిర్వహణ, టెక్నాలజీ వినియోగానికి పరిపాలన వ్యయం కింద రూ.510.05 కోట్లు కేటాయించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక ‘మేట్’ను నియమించి, ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే ఆన్‌లైన్ హాజరు నమోదు చేస్తారు. ఇంజినీరింగ్ కొలతలు, మార్కౌట్ పక్కాగా తీసి పూర్తి కూలీ రేటు నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
వచ్చే నెల15 వరకు ‘వికసిత్ భారత్’ ప్రణాళికలు
కేంద్రం రూ.6,311.78 కోట్ల బడ్జెట్‌ను నిర్ణయించగా.. ఈ నిధులను గ్రామాల్లో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ‘వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు’ రూపొందించాలని డెడ్‌లైన్ విధించింది. మొత్తం 22 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి గ్రామంలో కనీసం 5 ఫామ్ పాండ్లను తక్షణమే పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
