కుల గణన ప్రశ్నావళిని రద్దు చేయండి..తెలంగాణ మోడల్ అమలు చేయాలని డిమాండ్

కుల గణన ప్రశ్నావళిని రద్దు చేయండి..తెలంగాణ మోడల్ అమలు చేయాలని డిమాండ్
  • ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ
  • ప్రస్తుత పద్ధతిని తాము అంగీకరించబోమని వ్యాఖ్య
  • తెలంగాణ మోడల్​ అమలు చేయాలని సూచన

న్యూఢిల్లీ: దేశంలో కులగణన కోసం రూపొందించిన ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేయాలని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, ఎక్స్​పర్ట్స్,​ సాధారణ ప్రజలను సంప్రదించి కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

 ప్రస్తుత పద్ధతిలో జరుగుతున్న కుల గణనను తాము అంగీకరించబోమని.. తెలంగాణ, బిహార్​లో జరిగిన కుల సర్వేలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి వారు లేఖ రాశారు. వారు ఆ లేఖతో పాటు తెలంగాణ కుల సర్వే (2024), బిహార్ కుల సర్వే (2022) కులాల జాబితా కాపీలను జతచేశారు. 

దేశంలో కచ్చితమైన సమాచారం లేకుండా సామాజిక న్యాయ విధానాలను సమర్థంగా అమలు చేయలేమని, కుల గణనను సరిగ్గా నిర్వహిస్తేనే వివిధ కులాల సంఖ్యాబలం, సామాజిక- ఆర్థిక స్థితిపై కచ్చితమైన అంచనా సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. 

‘జన గణనలో కుల వివరాలను నమోదు చేయడానికి మీ ప్రభుత్వం స్వేచ్ఛాయుత ప్రశ్నల విధానాన్ని ఎంచుకుంది. ఇది తప్పుదోవ పట్టిస్తుంది. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి తన కులానికి ఏ పేరు చెప్పినా.. అది ఉన్నది ఉన్నట్టుగానే నమోదు చేస్తారు. మన దేశంలో ఒకే కులాన్ని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భాషా వైవిధ్యాలతో పిలుస్తారు.

 దీంతో జన గణన సమయంలో ఒకే కులానికి చెందిన సభ్యులను వేర్వేరు పేర్లతో నమోదు చేస్తే, ఒకే కులం వేలాది విభిన్న పేర్లుగా విడిపోయే అవకాశం ఉంది. దీని ఫలితంగా లక్షలాది కులాల 
పేర్లతో కూడిన జాబితా ఏర్పడి, కులగణన నుంచి పొందిన మొత్తం డేటా నిరుపయోగంగా మారుతుంది’ అని ఖర్గే, రాహుల్ వాదించారు.

లోపభూయిష్టమైతే నష్టమే..

ఒక వర్గం వాస్తవ జనాభాను కచ్చితంగా నమోదు చేయకపోతే, వారి స్థితిగతులపై చేసే ఏ అంచనా అయినా లోపభూయిష్టంగా ఉంటుందని.. ఇది వెనకబడిన, అత్యంత వెనకబడిన, ఇతర అణగారిన వర్గాలకు నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. 

అన్నిటికంటే ముఖ్యంగా ఈ విధానం దేశంలోని ఓబీసీ జనాభా పరిమాణాన్ని వెల్లడించడంలో విఫలమవుతుందన్నారు. ఎందుకంటే ఈ జనాభా లెక్కలలో ‘వెనకబడిన తరగతి' అనే పదాన్ని కూడా చేర్చలేదని వారు అన్నారు. అయితే, దీనికి ఒక సులభమైన పరిష్కారం ఇప్పటికే ఉందన్నారు. ‘కులాల డ్రాప్-డౌన్ జాబితాను రూపొందించాలి. 

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గణన కోసం అనుసరించిన పద్ధతి ఇదే. సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల జాబితాలు, ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి జాబితా వంటి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ జాబితాల ఆధారంగా ఇటువంటి జాబితాను సులభంగా రూపొందించవచ్చు’ అని మోదీకి రాసిన లేఖలో ఖర్గే, రాహుల్​పేర్కొన్నారు.

 కాగా, కుల గణనలో ఓపెన్ ఎండెడ్ ప్రశ్నావళిని మార్చాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్​ డిమాండ్​ చేశారు. 2027 జన గణనలో తెలంగాణ, బిహార్ మోడల్​ను అమలు చేయాలని సూచించారు. ఈమేరకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన మూడో లేఖను ప్రస్తావిస్తూ జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.