- అధికారులతో సీఎం చర్చించి ఉంటే క్లియరెన్స్ వచ్చేది
- అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలా?
- వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలె
- ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తన అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు అన్ని అనుమతులు తీసుకున్నాకే విదేశీ పర్యటన ఖరారు చేసుకుంటారన్నారు.
రేవంత్ రెడ్డి ఆదరాబాదరగా లండన్ వెళ్లి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకున్నారని చెప్పారు. ఆయన విదేశాలకు వెళ్లక ముందే స్థాయికి తగ్గట్టు పర్యటన లేదని, అందుకే అనుమతులు ఇవ్వడం లేదని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పిందన్నారు.
దీనిపై అధికారులతో చర్చించి క్లియరెన్స్ తీసుకోవాల్సిందని హితవు పలికారు. అంతేకానీ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
విదేశీ టూర్ల విషయంలో విదేశాంగ శాఖ నిబంధనలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒకేలా ఉన్నాయని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన అమెరికా పర్యటనకు అనుమతులివ్వకపోవడంతో తెలంగాణకు ఏదో అన్యాయం జరిగిందనేలా సీఎం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇది రాజకీయం కాదు..
సీఎం, కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనల అంశం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని, ఇదేమీ రాజకీయ అంశం కాదని కిషన్‌రెడ్డి అన్నారు. ఇదేదో కొత్త విషయమైనట్టు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ‘ఆయన పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. తన స్థాయి తగ్గించుకొని సీఎం ఇలా మాట్లాడటం సరికాదు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని హితవుపలికారు.
ప్రధానిని టెర్రరిస్ట్‌తో పోల్చిన వ్యక్తితో భేటీకి యత్నామా?
విదేశాల్లో జరిగే సదస్సులు, సమావేశాలు, భేటీల్లో కలిసే వ్యక్తుల స్థాయి, వారి బ్యాక్‌గ్రౌండ్, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని కిషన్ రెడ్డి చెప్పారు. ‘పర్యటనలు దేశ ప్రయోజనాలు, విదేశాంగ విధానాలను అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు. కానీ, వీటన్నింటినీ పక్కనపెట్టి రేవంత్ రెడ్డి అసలు విషయం చెప్పకుండా విమర్శలు చేయడం హాస్యాస్పదం.
పాకిస్తాన్ అనుకూల వైఖరి కలిగిన న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలవడానికి రేవంత్ ప్రయత్నించారని పత్రికల్లో చదివాను. ఇది వాస్తవమా? కాదా? అని రేవంత్ రెడ్డి చెప్పాలి. మమ్దానీ భారత ప్రధానిని టెర్రరిస్టుతో పోల్చాడు.. అలాంటి వ్యక్తిని కలవడానికి రేవంత్ ప్రయత్నించారా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మాటలు తప్ప.. చేతలు లేవు
సెప్టెంబర్ 2 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతోందని, ఈ కాలంలో తెలంగాణకు ఏం చేశారో సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి తప్ప అభివృద్ధి లేదని, మాటలు తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు.
హైదరాబాద్‌లో 20% ఇండ్లకు కూడా వెళ్లలేదన్నారు. ఇదే విషయాన్ని బీసీ సంఘాలు కూడా చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనను శాస్త్రీయ పద్ధతిలో చేస్తోందని, ఇందులో కుల గణన కూడా జరుగుతోందన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి అవగాహన లేదని విమర్శించారు.
కోయగూడెం బ్లాక్ 3 సింగరేణికి వచ్చేలా చొరవ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోయగూడెం బ్లాక్–3 సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ బ్లాక్ ద్వారా.. 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యే అవ కాశం ఉందన్నారు.
ఇక్కడ గ్రేడ్-13 బొగ్గు అందుబాటులో ఉందని తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రిలోని పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా అయ్యేలా ఒప్పందం జరిగిందన్నారు. తెలం గాణకు చెందిన వ్యక్తిగా సింగరేణికి తాడిచర్ల–2, పీకేవోసీ–2 కాస్ట్ డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణకి వచ్చే లా అనేక మందితో మాట్లాడి చర్యలు తీసుకున్నానన్నారు.
అయితే దుబారా ఖర్చులను తగ్గించి సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణికి ఇవ్వాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
